హైదరాబాద్ : చాలా సినిమాల్లో రోగి పొట్టలో దూది మర్చిపోవడం విన్నాం... కత్తులు మర్చిపోయి కుట్లు వేసేయ్యడం చూశాం. ఆఖరికి అదేదో సినిమాలో రోగి పొట్టలో వాచ్, సెల్‌ఫోన్లు మర్చిపోయిన సన్నివేశాలు.. ఆ తర్వాత బాధితుడు ఇబ్బంది పడే దృశ్యాలను చూసే ఉంటాం. అయితే తాజాగా నిమ్స్ ఆస్పత్రిలో కూడా అటువంటి సంఘటనే చోటుచేసుకుంది. నిమ్స్ వైద్యులు...ఓ మహిళా రోగికి ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరచిపోయారు. అయితే ఆ తర్వాత రోగి కడుపు నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పడంతో..వారు వైద్యులను సంప్రదించారు. అసలు విషయం ఎక్స్‌రే తీసిన అనంతరం బయటపడటంతో వైద్యుల నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్‌కు చెందిన మహేశ్వరి (33) అనే మహిళ మూడు నెలల క్రితం హెర్నియా ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆ తర్వాత ఆమెకి తరచుగా కడుపు నొప్పి రావడంతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ ఆమెకు ఎక్స్‌రే తీయడంతో కడుపులో కత్తెర ఉన్నట్లు బయటపడింది. దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నిమ్స్‌కు రాగా, ఆపరేషన్ చేసిన వైద్యులు ప్రస్తుతం అందుబాటులో లేరంటూ సమాధానం ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహిరంచిన వైద్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం మీడియాకు ఎక్కడంతో నిమ్స్ వైద్యులు బాధితురాలికి తిరిగి ఆపరేషన్ చేసేందుకు సిద్ధం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment