
ఉప్పల్‌లో నితిన్ గడ్కరీ ప్రచారం
సాక్షి, హైదరాబాద్ : అవకాశవాద పార్టీలతో ఏర్పడిన ప్రజాకూటమిపై ప్రజలకు విశ్వాసం లేదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. స్వార్ధ రాజకీయాల కోసమే కూటమిని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టాడని విమర్శించారు. ఉప్పల్ రింగ్‌రోడ్డులో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తో కలిసి ఆదివారం రోడ్డుషోలో పాల్గొన్న గడ్కరీ టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలని ధ్వజమెత్తారు.నిన్నటి వరకూ తమతో ఉన్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రత్యేక ప్రణాళికలతో బీజేపీ ముందుకొస్తుందని హామీ ఇచ్చారు. ఛాయ్‌వాలా ప్రధాని అయ్యాడంటే అది బీజేపీ గొప్పతనమని చెప్పుకొచ్చారు.