ఇక విచారణ.. | Nnw Voter Registration Program In Khammam | Sakshi
Sakshi News home page

ఇక విచారణ..

Published Thu, Sep 27 2018 11:25 AM | Last Updated on Thu, Sep 27 2018 11:25 AM

Nnw Voter Registration Program In Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారంతో ముగిసింది. ఇక  బుధవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ కొనసా గనుంది. ఈ తంతు ముగిసిన తర్వాత అధికారులు ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా.. ఓటరు జాబితాలో ఉన్న పేర్లను ఏకపక్షంగా తొలగించకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. వీటిని అనుసరిస్తూ అధికారులు, సిబ్బంది విచారణ చేపట్టనున్నారు. 

భారత ఎన్నికల సంఘం ఈనెల 10వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటరు జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే అభ్యంతరాలు, ఏమైనా మార్పులు, చేర్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ ఈనెల 25వ తేదీ వరకు కొనసాగింది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో.. సంబంధి త పోలింగ్‌ కేంద్రంలో బూత్‌ లెవల్‌ అధికారిని సంప్రదించడం ద్వారా.. తెలంగాణ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. ఓటు ప్రాముఖ్యతపై పోస్టర్లను ప్రదర్శించారు. దీంతో జిల్లాలో అనేక మంది కొత్త ఓటర్లతోపాటు మార్పు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

క్షేత్రస్థాయిలో సిబ్బంది.. 
ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారు.. మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు విచారణ సిబ్బంది వెళ్లి వారు చేసుకున్న దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం నుంచి సిబ్బంది ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. దరఖాస్తుదారులకు సంబంధించిన ఆధారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఉదాహరణకు.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఆధార్‌ కార్డు, లేనిపక్షంలో అతడి వద్ద ఉన్న ఇతర గుర్తింపు కార్డులను పరిశీలిస్తారు. వాటిని సరిపోల్చుకుంటారు. ఒకవేళ ఎటువంటి గుర్తింపు కార్డు లేదంటే చుట్టుపక్కల వారిని విచారించి.. వారు ఎప్పటి నుంచి స్థానికంగా ఉంటు న్నారు అనే వివరాలను సేకరిస్తారు. ఆయా వివరాల ప్రకారం సిబ్బంది నివేదికను తయారు చేస్తారు. వచ్చే నెల 4వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం 8వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు.

77,581 దరఖాస్తులు 
ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై జిల్లావ్యాప్తంగా 77,581 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఈ దఫా ఓటరు నమోదుపై అధికారులు ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు. ప్రజలకు ఓటు హక్కు విలువ తెలిపే చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించడంతో దరఖాస్తులు కూడా అదేస్థాయిలో వచ్చాయి. కొత్త ఓటరు నమోదు కోసం 39,322, ఓటు తొలగింపు కోసం 30,290, ఓటు సవరణ కోసం 3,359, ఓటు మార్పు కోసం 4,610 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఓట్ల తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తుల్లో 17,115 మంది మృతిచెందారని, వారి పేర్లు తొలగించాలని వచ్చాయి. వికలాంగుల కోసం నిర్వహించిన కార్యక్రమంలో 19,564 మంది తమకు ఓటు హక్కు కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement