రైతన్నను మరచిన అసెంబ్లీ
* బడ్జెట్ సమావేశాల్లో దృష్టి సారించని పార్టీలు
* అన్నదాతల సమస్యలను ప్రస్తావించని వైనం
* ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయిన విపక్షాలు
* ఇతర అంశాల్లో అధికార పార్టీని ఇరుకునపెట్టే యత్నం
* ప్రతిపక్షాలను సమర్థంగా అడ్డుకున్న అధికారపక్షం
సాక్షి, హైదరాబాద్: వర్షాభావం, కరువు పరిస్థితులతో రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారిన తరుణంలో, కరెంటు లేక పంటలు నష్టపోయి అన్నదాతలు కుదేలైన నేపథ్యంలో మూడు వారాల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశమే ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. భూ ఆక్రమణలు, మెట్రో భూముల బదలాయింపు, నూతన పారిశ్రామిక విధానంపైనే గంటల తరబడి చర్చ జరిగింది. భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించడానికే అధికారపక్షం ప్రాధాన్యతనిచ్చింది. మరోవైపు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విపక్షాలు విఫలమయ్యాయన్న విమర్శను మూటగట్టుకున్నాయి. సభలో అన్ని అంశాలపైనా ప్రధానంగా ముగ్గురు మంత్రులే ఎక్కువగా జోక్యం చేసుకుని మాట్లాడటం కూడా చర్చనీయాంశమైంది.
బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ఈ అంశాన్నే ప్రస్తావించడమే కాక ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఇక డీఎల్‌ఎఫ్ భూములకు సంబంధించి ముఖ్యమంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు కానీ, ఆ అంశాన్ని తెరపైకి తెచ్చిన తెలుగుదేశం సభ్యుడు రేవంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అధికారపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎంపీ కవిత విషయంలో సభకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌తో టీఆర్‌ఎస్ సభ్యులు ఆయన్ని పూర్తిగా కట్టడి చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేసింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ సమావేశాల్లో ఒక దశ-దిశ లేకుండా వ్యవహరించి అభాసుపాలైందని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. తాజాగా ద్రవ్యవినిమయ బిల్లుపై ఆ పార్టీ వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేందుకు విప్ జారీ చేసింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ద్రవ్యవినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ రెండు పరిణామాలను పక్కనబెట్టి, అదే బిల్లుకు ప్రతిపక్ష నేత జానారెడ్డి ఓటింగ్ కోరకుండానే మద్దతు ప్రకటించడం ఆ పార్టీ సభ్యులనే విస్మయపరిచింది. ప్రధాన ప్రతిపక్షంగా పజా సమస్యలపై మిగిలిన విపక్షాలను కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ ఏ దశలోనూ ఆ ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారపక్షం సక్సెస్
చీటికి మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడుతూ వార్తల్లో నిలుస్తున్న పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను నిలువరించేందుకు టీఆర్‌ఎస్ వేసిన ఎత్తుగడతో ప్రధాన ప్రతిపక్షం ఆత్మరక్షణలో పడింది. అసైన్డ్ భూముల ఆక్రమణకు సంబంధించి అధికారపక్షం నేరుగా పొన్నాలనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడింది. దీనిపై సభాసంఘం వేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చి కాంగ్రెస్ మద్దతుతోనే దాన్ని ఆమోదించుకుంది. సీఎంను ఇరకాటంలో పడేసేందుకు డీఎల్‌ఎఫ్ భూముల వివాదాన్ని తెరమీదికి తెచ్చిన టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డిని కూడా టీఆర్‌ఎస్ కట్టడి చేసింది.
ఎంపీ కవితపై వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలచుకొని ఆయనకు మాట్లాడే అవకాశమే రాకుండా అడ్డుకుంది. డీఎల్‌ఎఫ్ భూముల బదలాయింపు అంశం చర్చకు వచ్చేలా అధికార పార్టీ సభ్యులే సావధాన తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని అధికారపక్షం మాట్లాడనివ్వకపోవడంతో సీఎల్పీ కార్యదర్శి మల్లు భట్టివిక్రమార్క తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యమంత్రిపై ఆయన నేరుగా విమర్శల దాడికి దిగడం ఆ పార్టీకి కొంతలో కొంత ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన అనేక ఉదాహరణలు చెప్పుకొచ్చారు. ఇక టీడీపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ సభలో ఏనాడూ ఆ పార్టీకి మద్దతుగా ముందుకు రాలేదు. వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై మజ్లిస్ ఇచ్చిన సావధాన తీర్మానాన్ని కూడా అధికారపక్షం తనకు అనుకూలంగా మలుచుకుని సభాసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇక రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఏ పార్టీ ప్రయత్నించలేదు. ‘మొక్కుబడిగా వాయిదా తీర్మానాలు ఇచ్చామే తప్ప, రైతుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో మేం విఫలమయ్యాం. దానికి అనేక కారణాలు తోడయ్యాయి’ అని కాంగ్రెస్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.