పన్నుల శాఖ
సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక రాష్ట్ర పన్నుల శాఖలో ప్రతిదీ ఓ ప్రహసనంగానే మారిపోతోంది. ఉద్యోగులకు పని విభజన నుంచి డీలర్ల పన్ను మదింపు, ఆడిటింగ్ వరకు అన్ని అంశాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న అభిప్రాయం శాఖ సిబ్బందిలోనే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉద్యోగుల పదోన్నతులు, పోస్టింగులు, అప్‌గ్రెడేషన్ లాంటి ఫైళ్లు నత్తనడకన నడుస్తుండగా.. కీలకమైన శాఖ విస్తరణ ప్రక్రియ అంతకన్నా నెమ్మదిగా కొనసాగుతూ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగుల్చుతోంది.
పెంపు ప్రతిపాదనలకు మోక్షమెప్పుడు?
వాస్తవానికి పన్నుల శాఖలో డివిజన్లు, సర్కిళ్ల పెంపు ప్రతిపాదన రెండేళ్ల నుంచే ఉంది. డీలర్లు పెరుగుతున్నా డివిజన్లు, సర్కిళ్లు పెరగడం లేదని.. క్షేత్రస్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు డీలర్లపై పర్యవేక్షణ ఇబ్బంది అవుతోందని, శాఖను సంస్థాగతంగా విస్తృతం చేసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 91 సర్కిళ్లు, 12 డివిజన్ల ద్వారా పన్నుల శాఖ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. డివిజన్ల సంఖ్యను 20కి, సర్కిళ్ల సంఖ్యను 175కు పెంచాలని ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. కానీ ఉన్నతాధికారులు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నేపథ్యంలో ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడు నెలలు దాటుతున్నా.. డివిజన్లు, సర్కిళ్ల ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు. మరోవైపు 33 వేల మంది డీలర్ల బాధ్యతలను నిర్వహిస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ శాఖ మాత్రం జీఎస్టీకి అనుగుణంగా తమ వార్డులను 253కి పెంచుకుంది. కానీ ఏకంగా 1.5 లక్షల మంది డీలర్లకు సంబంధించి బాధ్యతలున్న పన్నుల శాఖలో మాత్రం చర్యలు లేకపోవడం గమనార్హం.
అప్‌గ్రెడేషన్ చాలు!
పన్నుల శాఖ పరిధిలో ఒక సర్కిల్‌లో 6 వేల మంది డీలర్లుంటే.. మరో సర్కిల్‌లో నాలుగైదు వందల మంది కూడా లేని పరిస్థితి ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతో శాఖను పునర్వ్యవస్థీకరించాలని కోరుతున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణకు కొత్త పోస్టులు కూడా అవసరం లేదని, అదనపు భారం లేకుండానే... కేవలం పోస్టుల అప్‌గ్రెడేషన్ సరిపోతుందని అంటున్నారు. అయితే పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. అయితే ఇటీవల జాయింట్ కమిషనర్ స్థాయిలో కొత్త ప్రతిపాదన రూపుదిద్దుకుందని.. శంషాబాద్, అబిడ్స్, మాదాపూర్‌ల పేరుతో మూడు కొత్త డివిజన్లను ఏర్పాటు చేస్తూ, 15–18 సర్కిళ్ల పెంపుతో సరిపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్టు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. కనీసం ఇదైనా అమలుకు నోచుకుంటుందో, లేదోనని పన్నుల శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment