ఆత్మగా చెప్పబడే అనంతశక్తి పదార్థంగా, తిరిగి ఆత్మగా పరిణమిస్తూ ఉండడం నిరంతర ప్రక్రియ. ఈ అద్వైత సిద్ధాంతమే కనిపించేవన్నీ ఆత్మ స్వరూపాలేనని నిర్ధారిస్తోంది. అంతేకాక, అత్యంత సాంద్రతమ ఆత్మలో పదార్థము, పదార్థ అంతరాలలో ఆత్మ సమ్మిళితమై విరాజిల్లడమే గమ్మత్తు అంటోంది. ఈ పదార్థాలన్నింటినీ తనలో చరించే అవకాశం ఇచ్చే ఆకాశం కూడా ఆత్మలో ఒకానొక చిన్న భాగమేనంటే ఆ ఆత్మ పరిధి, సాంద్రతలు ఊహకందనివి. ఈ ఆత్మజనిత పదార్థాలు అంతర్గత చర్యలను జరుపుతూ తమ రూపాలను సూక్ష్మస్థాయి నుండి ప్రౌఢస్థాయి వరకు, ప్రౌఢస్థాయి నుండి వార్థక్యంలోకి తీసుకువెళ్లి, ఆ చర్యలు ఆగిపోగానే నశించిపోతాయి.
దీనికి చక్కని ఉదాహరణ మన ఆదిత్యుడే. ఖగోళపరంగా చూస్తే ఆయనకూ పరిమిత జీవితమే ఉంది. సూర్యుని ఆవిర్భావానికి కారణమైన కేంద్రక సంలీనం అనే ప్రక్రియ నిత్యం కొనసాగుతూ, కాంతి, శబ్దం, ఉష్ణం లాంటి శక్తి రూపాలను వెలువరుస్తూ, సూర్యుని లోపలి హైడ్రోజన్‌ను పూర్తిగా వినియోగించి చివరకు సూర్యుని అంతానికి హేతువు అతుంది. ఈ ప్రక్రియ అనేది సూర్యునికి జీవం లాంటిది. ఈ ప్రక్రియను మనలో జరిగే జీర్ణశక్తితో, తద్వారా ఉద్భవించే ప్రాణంతో పోల్చుకోవచ్చు.సూర్యునితో సహా విశ్వంలో ఉన్న నక్షత్రాలు మొదలుకొని జీవుల వరకు ‘బ్రహ్మసూత్రాల’లో చెప్పిన ‘జన్మాద్యస్య యతః‘ అన్నట్టుగా పుట్టుట, పెరుగుట, నశించుట ఎవనియందు జరుగుతున్నదో అదే బ్రహ్మము అనే సూత్ర పరిధిలోకే వస్తారు.
అదే విధంగా భూమి కూడా అనుకూల పరిస్థితుల వలన జలావరణాన్ని పొంది, తద్వారా ఈ ప్రకృతిని తయారు చేసుకుంది. ఎప్పుడైతే ఈ జలావరణం నశిస్తుందో, అప్పుడు భూమిపై ప్రాణం నశించి, సర్వాంతర్యామిలో లయమైపోతుంది. ఆదిశంకరుల ‘ఆత్మబోధ’ లో ఎలాగైతే చిల్లగింజల గంధం మురికి నీటిలో వేస్తే మురికిని తొలగిస్తూ, నీటిలో కలిసిపోతుందో, అలాగే జ్ఞానం, అజ్ఞానిలో ప్రవేశించగానే అజ్ఞానం తొలగి పోవడమే కాక, అజ్ఞాని జ్ఞానియై ఆత్మగా శోభిల్లుతాడని చెప్పబడింది. ఇదే విషయాన్ని ఐన్ స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం లో’ బలీయమైన నమ్మకం ఆవరించిన విస్తృత మేథస్సుతో ఆలోచిస్తే, ఈ అనుభవాత్మక ప్రపంచమంతా దేవుడనే అవగాహన కలుగుతోంది. సాధారణ మాటల్లో చెప్పాలంటే అదే విశ్వదైవత్వం ఇది అవగాహనలోకి వస్తే జీవి మనుగడంతా దైవత్వమే!
Comments
Please login to add a commentAdd a comment