ఎదురుచూపులు | NTR to plan apgredesan eclipse | Sakshi
Sakshi News home page

ఎదురుచూపులు

Published Thu, Jun 2 2016 12:24 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

NTR to plan apgredesan eclipse

రెండేళ్లుగా ఒక్క పక్కా గృహానికీ అనుమతి లేదు
ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు 1,09,525
64,789 మంది       అర్హులుగా గుర్తింపు
ఎన్టీఆర్ అప్‌గ్రేడేషన్ పథకానికి గ్రహణం

 

మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి రెండేళ్లు గడిచాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మాటలు నమ్మిన పేదలు ఉన్న ఇంటిని కూల్చి పక్కా గృహ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో ఇంత వరకు ఒక్క ఇంటికీ అనుమతి ఇవ్వలేదు. జిల్లాలో 15,500 గృహాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పరిపాలనా పరమైన ఆమోదం ఇవ్వలేదని గృహనిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికి ఆమోదం తెలుపుతుందో తెలియని పరిస్థితి ఉంది. పక్కా గృహాల నిర్మాణానికి ఆమోదం తెలపకుండానే లబ్ధిదారుల ఎంపికలో సవాలక్ష ఆంక్షలను ప్రభుత్వం     విధిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలకు సొంతింటి కలను నెరవేరుస్తామని ప్రకటించారు.


టీడీపీ అధికారం చేపట్టిన తరువాత జన్మభూమి - మాఊరు కార్యక్రమాలతో పాటు మీ-కోసంలో పక్కాగృహాల నిర్మాణం కోసం 1,09,525 మంది దరఖాస్తు చేశారు. వీటిని తనిఖీ చేసి 64,789 మందిని అర్హులుగా తేల్చారు. మిగిలిన 44,736 మందిని అనర్హులుగా గుర్తించారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం పేరును ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకంగా మార్పు చేశారు. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 1250 చొప్పున 15వేలు, మచిలీపట్నం రూరల్ మండలానికి 500, మొత్తంగా 15,500 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. వీటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. వీటిలో ఐఏవై ద్వారా 4,964, ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా 10,536 గృహాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో ఎస్సీలకు 3,590, ఎస్టీలకు 1,406, ఇతరులకు 10,504 గృహాలను కేటాయిస్తున్నట్లు పేర్కొంది. పక్కాగృహాల నిర్మాణంలో లబ్ధిదారులను ఎంపిక చేయటంలో జన్మభూమి కమిటీ సభ్యులు కీలకపాత్ర పోషించటం విమర్శలపాలవుతోంది.

 
స్పష్టత కరువు

రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణ వ్యయాన్ని రూ.2.90 లక్షలకు పెంచింది. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రూ.1.20 లక్షలు, గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా సబ్సిడీగా రూ.60వేలు, బ్యాంకు రుణంగా రూ.1.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో రూ.2.75 లక్షలుగా ఉన్న ఈ మొత్తాన్ని రూ.2.90 లక్షలకు పెంచింది. బ్యాంకు ద్వారా ఇచ్చే రుణం ఎప్పటికి మంజూరవుతుంది. ఏ నిబంధనల మేరకు మంజూరు చేస్తారనే అంశంపై స్పష్టత లేదు.

 
ఎన్టీఆర్ అప్‌గ్రేడేషన్ అంతంతే

జిల్లాలో 1994 నుంచి 2004 వరకు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన గృహాలకు మరమ్మతులు చేసేందుకు ఎన్టీఆర్ అప్‌గ్రేడేషన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాకు 9వేల గృహాలకు మరమ్మతులు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఇందులో ఎస్సీలు 1539, ఎస్టీలు 480, ఇతరులు 6,981 మందికి అవకాశం కల్పించారు. ఇంటికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. జన్మభూమి కమిటీ సభ్యులు అర్హులను గుర్తించి జాబితాలను తయారు చేయాల్సి ఉంది.  ఇప్పటికి 5వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించాలని గృహనిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement