ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని భైరిపురం...గృహనిర్మాణ పథకంలో ఇల్లు కావాలని 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు కలిసి ఆ దరఖాస్తుదారుల్లో 18 మందితో మాత్రమే దరఖాస్తు చేయించారు. ఈ ప్రక్రియ కోసం రూ.5 వేలు, తర్వాత ఇల్లు మంజూరు కోసమంటూ రూ.25 వేలు వరకూ వసూళ్లు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే రూ.1.50 లక్షల ఇంటి సొమ్ము కోసం రూ.30 వేల వరకూ కమీషన్లు కొట్టేస్తున్నారని సొంత పార్టీవారే ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా నిలదీస్తే తమ ఇల్లు ఎక్కడ చేజారిపోతుందోనని వారే భయపడుతుండటం గమనార్హం!!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులు అధికార పార్టీ నాయకుల తీరుతో నష్టపోతున్నారు. ఈ పరిస్థితి ఒక్క ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే కాదు జిల్లావ్యాప్తంగా ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఊరించీ ఊరించీ రెండున్నరేళ్ల తర్వాత ఎన్‌టీఆర్ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు ఇస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది! ఆ ఇళ్లు కూడా టీడీపీ నాయకుల అనుయాయులకే కట్టబెడుతున్నారు. జన్మభూమి కమిటీల సభ్యులు రంగంలోకి దిగి వసూళ్ల పర్వానికి తెరలేపారు. అలాగే ఇల్లు మంజూరయ్యాక బిల్లుల చెల్లింపు సమయంలో హౌసింగ్ అధికారులకూ కమీషన్లు ఇవ్వాలని చెప్పి కలెక్షన్లు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారుల పరిస్థితి మింగ లేక కక్కలేకా అన్నట్లుగా తయారైంది. పథకం కింద ఇంటి నిర్మాణానికొచ్చేది రూ.1.50 లక్షలైతే అందులో రూ.30 వేల వరకూ ఆమ్యామ్యాలకే పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్కడ నోరువిప్పితే బిల్లులు అర్ధంతరంగా నిలిపేస్తారేమోననే భయం వారిని వెంటాడుతోంది.
టీడీపీ ప్రభుత్వం తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్లేవీ మంజూరు చేయలేదు. ఎన్‌టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద 2016–17లో మాత్రం నియోజకవర్గానికి 1,250 చొప్పున ప్రకటించింది. ఆ తర్వాత 12,235 ఇళ్లు ఇస్తున్నట్లు హామీ ఇచ్చింది. ఈ సంవత్సరం మరో 13,486 ప్రకటించింది. కానీ ఇవేవీ వాస్తవ అర్హులకు చేరట్లేదు. కేవలం టీడీపీ కార్యకర్తలకే కట్టబెడుతున్నారు. వారి నుంచి కూడా కమీషన్లు వసూలు జరుగుతోంది. ఈ పథకం కింద యూనిట్ విలువ రూ.1.50 లక్షలు. అయితే దీనిలో రూ.95 వేలు హౌసింగ్ కార్పొరేషన్ విడుదల చేస్తుంది. మిగిలిన రూ.55 వేలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద వస్తాయి. ఈ యూనిట్ మొత్తంలోనే సిమెంట్, ద్వారాలు, కిటికీలు లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి. యూనిట్ విలువ మొత్తానికి మూడు నాలుగు దఫదఫాలుగా చెల్లింపులు చేస్తున్నారు. ఈ సమయాల్లోనే లంచాలు ఎక్కువవుతున్నాయనే కారణంతోనే బిల్లు మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసే విధానం తీసుకొచ్చారు. అయినా సంబంధిత హౌసింగ్ సిబ్బంది జన్మభూమి కమిటీలతో కుమ్మక్కై... బిల్లులు బ్యాంకులో జమ అయిన తక్షణమే లబ్ధిదారుల నుంచి కమిషన్‌లను ముందుగానే వసూలు చేస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకుపాస్ పుస్తకాలు జన్మభూమి కమిటీల వద్దే ఉంచేస్తున్నారు. ఇలా ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.30 వేల వరకూ దఫదఫాలుగా దండేస్తున్నారు.
చివరకు మిగిలేది అప్పులే...
వాస్తవానికి చిన్న ఇల్లు నిర్మించుకోవాలన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రూ.5 లక్షలకు పైమాటే! దీనిలో హౌసింగ్ పథకం కింద రూ.1.50 లక్షలు వస్తే కొంత ఊరట కలుగుతుందనేదీ పేదప్రజల ఆశ. కానీ బిల్లుల మొత్తం చేతికొచ్చేసరికి అందులో రూ.30 వేల వరకూ జేబుకు చిల్లుపడుతోంది. ఇటీవల కాలంలో సిమెంట్, ఇనుము, ఇటుక ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండట్లేదు. ఇక ఇసుక ఉచితమే ప్రభుత్వం ప్రకటించినా ఇంటికి తెచ్చుకునేసరికి లోడుకు వాస్తవ ధర కన్నా రెట్టింపు మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇల్లు పూర్తయ్యేసరికి అప్పులే మిగులుతున్నాయనే ఆవేదన లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది.
ఎంతమందికి ఇల్లు వచ్చిందో తెలియదు
భైరిపురం గ్రామంలో ఎన్టీఆర్ గహనిర్మాణ పథకం కింద ఎంతమందికి ఇల్లు మంజూరైందో ఇంతవరకు అధికారులు చెప్పడం లేదు. కానీ ఇల్లు పేరుతో భారీఎత్తున వసూళ్లు జరుగుతున్నాయి. అంతా అయోమయమైన పరిస్థితి. వాస్తవాలను అధికారులు వెల్లడించకపోవడం వల్ల పేదలు మోసపోతున్నారు. –యలమంచిలి నీలయ్య, కవటి మండల ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment