కమలం కసరత్తు
అభ్యర్థుల ఖరారుపై బీజేపీ మల్లగుల్లాలు
దరఖాస్తుల వడపోత
ఒక్కో డివిజన్‌కు 1- 2 పేర్లు ప్రతిపాదన
సీట్ల సర్దుబాటు తేలాకే తుది జాబితా
సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అర్హులను నిగ్గుతేల్చేందుకు కషాయ దళ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ నగర శాఖ వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ నియోజకవర్గాల నుంచి 2వేలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని అర్బన్ ప్రాంతం నుంచి 1000 మొత్తం 3వేల దరఖాస్తులు బీజేపీ కార్యాలయానికి అందాయి. ఆశావహుల సంఖ్య లెక్కకుమించి ఉండటంతో ఎవరినీ నొప్పించకుండా... అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు గ్రేటర్ బీజేపీ ఎన్నికల కమిటీ మల్లగుల్లాలు పడుతోంది. ఇందులో భాగంగా ఒక్కో డివిజన్ నుంచి ఇద్దరు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ ప్రాథమికంగా ఓ జాబితాను రూపొందిస్తున్నారు. రిజర్వేషన్ల కారణంగా పోటీ చేయలేని పలువురు నాయకులు తమ భార్యలు, కూతుళ్లను బరిలోకి దించేం దుకు వారి పేర్లతో దరఖాస్తు చేసుకొన్నారు. మరికొం దరు నేతలు తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సీటు కేటాయించాలంటూ ఎన్నికల కమిటీపై ఒత్తిడి తెస్తున్నారు. వీటిని స్వీకరించిన కమిటీ అభ్యర్థుల విద్యార్హతలు, స్థానికంగా చేసిన సేవలు, డివిజన్‌లో పార్టీకున్న బలం, అభ్యర్థి ఆర్థిక పరిస్థితి, సామాజికవర్గం, రిజ ర్వేషన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చారు. అయితే... మిత్రపక్షమైన టీడీపీతో సీట్ల సర్దుబాటు వ్యవహారం తేలాక తుది జాబితాను వెల్లడించేందుకు ఎన్నికల కమిటీ సభ్యు లు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వడపోత కార్యక్రమాన్ని గురువారం నాటికి పూర్తి చేసి ప్రాథమికంగా ఓ జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి తెలిపారు.
లెక్క తేలాకే...!
కలిసికట్టుగా బల్దియా బరిలోకి దిగాలని నిర్ణయించిన బీజేపీ-టీడీపీ మిత్రపక్షాలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నది లెక్కతేలక పోవడంతో ఇరుపార్టీ నాయకుల్లో అయోమయం నెలకొంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా ఇందులో బీజేపీకి ఎన్ని సీట్లు , ఏయే డివిజన్లు కేటాయిస్తారో చూసుకొని అక్కడ టీఆర్‌ఎస్, మజ్లీస్‌లకు ధీటైన అభ్యర్థులను రంగంలోకి దించాలని అగ్రనేతలు భావిస్తున్నారు. తమకు బలమున్న ప్రాంతాల్లోని 85 డివిజన్లను కేటాయించాలని బీజేపీ పట్టుబడుతుండగా 50 స్థానాలకు మించి ఇచ్చేది లేదని టీడీపీ చెబుతోంది. నగరంలోని 5 నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నందున ఆయా నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు తమకు కేటాయించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.అయితే... గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా నుంచి 30-35 దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీరిలో అర్హులను కాకుండా ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారికి సీట్లు ఇస్తే నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో ఈ వ్యవహారాన్ని సున్నితంగానే పరిష్కరించుకొనేందుకు అగ్రనాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే తాను ప్రతి పాదించిన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు సీట్లు ఇస్తే ఆయా డివిజన్లలో తమ అభ్యర్థులను ఇండిపెం డెంట్లుగా రంగంలోకి దించేందుకు ఎమ్మెల్యే యోచి స్తుండటం పార్టీకి మింగుడు పడటం లేదు. సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయ్యా క పార్టీలోని అంతర్గత విషయాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని గ్రేటర్ నాయకులు పేర్కొంటున్నారు.