టీడీపీ, బీజేపీ మధ్య 'గ్రేటర్' వార్
సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీల్లోనూ అసంతృప్త జ్వాలలు
నామినేషన్లు వేసుకోవాలంటూ అభ్యర్థులకు ఆదేశాలు
నామినేషన్లు దాఖలు చేస్తున్న ఇరు పార్టీల అభ్యర్థులు
హైదరాబాద్: మిత్రపక్షాల మధ్య గ్రేటర్ వార్ మొదలైంది. వార్డుల కేటాయింపులో మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు రగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 150 వార్డుల్లో టీడీపీ 90, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయాలని ఆయా పార్టీల నాయకత్వాలు చర్చల మధ్య సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ నిర్ణయమే ఇరు పార్టీల నేతల మధ్య చిచ్చు రేపింది.
ప్రధానంగా బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రాజేసింది. గ్రేటర్ లో బలం ఉన్నప్పటికీ టీడీపీకి ఎక్కువ సీట్లు వదులుకోవడమేంటని కొందరు నేతలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, గెలిచే అవకాశాలున్న స్థానాలను టీడీపీకి వదులుకోవడం కూడా నేతల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.
మరోవైపు గత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సైతం టికెట్లు దక్కకపోవడంపై టీడీపీలోనూ అంతర్గత పోరు తీవ్రమైంది. కొందరు నేతలు శనివారం నేరుగా పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు వచ్చి ఆందోళన చేశారు. గతంలో గెలుచుకున్న స్థానాలను బీజేపీకి ఎలా కేటాయిస్తారని కొందరు ప్రశ్నించగా, ఎంతో కాలంగా డివిజన్ లో పోటీ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్నప్పుడు తీరా ఎన్నికల సమయానికి ఆ స్థానాన్ని బీజేపీకి ఎలా కేటాయిస్తారంటూ మరికొంత మంది నాయకులు టీడీపీ అగ్రనేతలను నిలదీశారు.
దాంతో ఏం చేయాలో తెలియక సీట్ల సర్దుబాటు విషయంలో మరోసారి సమాలోచనలు చేయాలని ఇరు పార్టీల నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్ల కేటాయింపుల్లో కొన్ని మార్పులు చేయాలని, లేదంటే అసలుకే ఎసరొస్తుందని నేతలు చెబుతున్నారు. ఆదివారం నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ముందైతే నామినేషన్లు వేయండి... తర్వాత చూద్దాం అంటూ అసంతృప్తితో ఉన్న నేతలకు చెప్పారు. దాంతో అనేక డివిజన్లలో రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉండటంతో ఆలోగా ఏదో రకంగా బుజ్జగింపుల ద్వారా విరమించుకునేలా చేయొచ్చన్న భావనతో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు మాత్రం తాము విరమించుకునేది లేదని గట్టిగా చెబుతున్నారు. పార్టీ బీ ఫామ్ ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్ గానైనా సరే పోటీలో ఉంటామని బెదిరిస్తున్నారు.