ఆ కిక్కేలేదు..!
గ్రేటర్‌లో ఎదురీదుతోన్న మిత్రపక్షాలు
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికలంటే పార్టీల అధినేతలు రంగంలోకి దిగుతారు. గల్లీగల్లీ తిరిగి ఓటర్లను ఆకట్టుకుంటారు. అయితే, ఈ సారి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గడువు దగ్గరపడుతున్నా.. టీడీపీతో పొత్తు పెట్టుకున్న మిత్రపక్షమైన బీజేపీకి ఒనగూరింది ఏమీలేదు. టీడీపీ నుంచి నారా లోకేష్, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబల్లి దయాకర్ వంటి నాయకులు డివిజన్లలో పాదయాత్రలు, రోడ్ షోలు చేస్తున్నా ప్రయోజనం కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రేటర్‌లో బీజేపీ సొంతంగా ఏర్పాటు చేసుకొన్న పునాదుల ఆధారంగానే అడుగు ముందుకు వేయాల్సి వస్తోంది. బీజేపీ నాయకుల్లో సమన్వయ లోపం, టీడీపీతో సహకార లేమి వెరసి క్షేత్రస్థాయిలో ఇరుపార్టీ శ్రేణుల మధ్య మైత్రి కనిపించడం లేదు. ఇది నేరుగా ఫలితాలపైనే ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ఎల్బీస్టేడియంలో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల శంఖారావ సభలో చంద్రబాబు నాయుడు టీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించకపోవడం బీజేపీ నేతలను ఇరకాటంలో పడేసింది. రాష్ట్రస్థాయి నేతలు కూడాసక్సెస్ అయితే అది తమ బలమని, ఫెయిలైతే టీడీపీతో పొత్తు వల్లే ఇలా జరిగిందని లోపాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నంలో ఉన్నారు.
ఏటికి ఎదురీత..
{Vేటర్‌లోని 65 డివిజన్లలో బీజేపీ తన అభ్యర్థులను బరిలో నిలిపింది. అయితే, నాయకుల మధ్య విభేదాల కారణంగా సొంత పార్టీ నేతలే అంతర్గతంగా ప్రత్యర్థి పాత్ర పోషిస్తుండటంతో పలు డివిజన్లలో అభ్యర్థుల పరిస్థితి ఏటికి ఎదురీదుతున్నట్టుగా ఉంది. గెలుపు ఖాతాలో ఉన్న బాగ్ అంబర్‌పేట్, అడిక్‌మెట్, గాంధీనగర్, సైదాబాద్, గుడిమల్కాపూర్, రామ్‌గోపాల్‌పేట్, అమీర్‌పేట్, హబ్సీగూడ, గౌలిపురా, కాచీగూడ, గన్‌ఫౌండ్రీ, హిమాయత్‌నగర్ డివిజన్లలో సైతం ఇప్పుడు బీజేపీకి అననుకూల పరిస్థితి ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యాస్తున్నాయి.
2002లో టీడీపీతో కలిసి బీజేపీ నగరంలో అధిక సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు దివిటీ పెట్టి వెదికినా ఆ పరిస్థితి కన్పించట్లేదు. గోషామహల్ డివిజన్‌లో స్థానిక ఎమ్మెల్యే సూచించిన వ్యక్తులకు సీట్లు దక్కకపోవడంతో అక్కడ సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైంది.
టీడీపీతో పొత్తు కారణంగా తలెత్తిన పరిస్థితిని బీజేపీ అనుకూలంగా మలుచుకోలేక పోవడమే ప్రధాన లోపం. ఇందుకు రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య సమన్వయం కొరవడటంతో పాటు ఏకంగా 10 డివిజన్లలో మిత్రపక్షాల అభ్యర్థులే ఒకరిపై ఒకరు పోటీకి దిగారు.
ఓ పక్క మజ్లిస్, మరోపక్క టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో మరో పార్టీతో కలిసి సంఘటితంగా యుద్ధం చేయలేని అసక్తతలో బీజేపీ పడిపోయింది. కొన్నిచోట్ల పార్టీ శ్రేణులు చేస్తున్న కృషి.. రెట్టింపు ఫలితాలు పొందాల్సిన పరిస్థితిని దూరం చేసింది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా గ్రేటర్‌లో పైచేయి సాధించలేని గడ్డు పరిస్థితి బీజేపీకి ఎదురైంది.