
సాక్షి, హైదరాబాద్: ఒకరు కాదు ఇద్దరు కాదు 1,700 మంది ప్రతినిధులు.. వారిలో ఎందరో దిగ్గజ వ్యాపార సంస్థల అధిపతులు.. ఇలా దేశవిదేశాల్లో వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించిన వారు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నేపథ్యంలో ఒక్కచోటకు చేరుతున్నారు. ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు, ప్రత్యేకతగా నిలిచే అంశాలు ప్రపంచం దృష్టికి ఆకర్షిస్తాయి. హైదరాబాద్ వేదికైనందున.. తెలంగాణ బ్రాండ్ స్థాయి పెంచుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. బ్రాండ్ ఇమేజ్‌లో పర్యాటక రంగమూ భాగమే. ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే విషయంలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓ మెట్టు ఎదగాలన్న ప్రయత్నానికి నీతి ఆయోగ్ మోకాలొడ్డింది.
పారిశ్రామిక రంగంలో అతిరథ మహారథులు ఒక్కచోటుకు చేరుతున్న తరుణంలో వారి ముందు తెలంగాణ పర్యాటక ప్రత్యేకతను నిలిపేందుకు చేసిన ప్రయత్నాన్ని నీతి ఆయోగ్ పట్టించుకోలేదు. సదస్సులో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు, ప్రతినిధుల రోజువారీ కార్యక్రమాలేంటి.. వంటి విషయాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రాకుండా రహస్యంగా వ్యవహరించింది. పర్యాటక రంగం ప్రత్యేకతను ప్రతినిధుల ముందుంచేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ఓ ప్రణాళిక రూపొందించుకున్న ప్పటికీ... దాన్ని అమలు చేసే విషయంలో నీతి ఆయోగ్ అవకాశం కల్పించలేదు. అసలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మూడు రోజుల పాటు జరిగే సదస్సుకు రాష్ట్ర మంత్రులకే ఆహ్వానాలు లేకుండా పోయాయి. శాఖాధిపతులుగా ఉన్న ఐఏ ఎస్ అధికారులదీ అదే పరిస్థితి. ప్రతినిధులకు విందు ఏర్పాటు చేసిన గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్‌ల వద్దకు వెళ్లేందుకూ వారికి అవకాశం లేదు.