ప్రైవేట్ వాహనంలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న ప్రజలు
వాజేడు : ఏజెన్సీలో రవాణా వసతులపై అధికారులు, పాలకులు శీతకన్ను వేస్తున్నారు. వివిధ అవసరాల కోసం పల్లెల్లోని ప్రజలు పలు ప్రాంతాలకు ప్రతిరోజు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే 21 రోజులుగా వాజేడు మండలానికి బస్సులు రావడం లేదు. మార్చి 2న ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేడ్‌లో జరిగిన ఎదురుకాల్పుల ఘటన తర్వాత బస్సులను నిలిపివేసినట్లు తెలిసింది. మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ప్రతీకారం తీర్చుకుంటారేమోననే కోణంలో బస్సులను నిలిపివేసి ఉంటారని ఈ ప్రాంత ప్రజలు భావించారు. మావోయిస్టుల బంద్ తర్వాత బస్సులను పునరుద్ధరిస్తారని ఆశించారు. కానీ ఇప్పటివరకు బస్సులను నడుపకపోవడంపై ప్రజల్లో అయోమయం నెలకొంది. వాజేడు మండలంలో 26 వేల మంది జనాభా ఉంది. వీరంతా ప్రతీ అవసరానికి వెంకటాపురం, భద్రాచలం, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. అయితే 21 రోజులుగా బస్సులు రాకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిచక తప్పడం లేదు.
ఏడు బస్సులు రద్దు..
భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి గతంలో 25 బస్సులు నడిచేవి. వాటిలో కొన్ని సర్వీసులను అప్పట్లోనే రద్దు చేసి.. ఎనిమిదికి కుదించారు. ఆ ఎనిమిదిలోనూ ప్రస్తుతం కేవలం ఒక్క రాజమండ్రి సర్వీసును మాత్రమే నడుపుతున్నారు. 21 రోజులుగా మిగతా ఏడు బస్సులు వాజేడు మండలానికి రావడంలేదు. దీంతో మండల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. భద్రత దృష్ట్యా బస్సులను నిలిపివేసినా.. ప్రజల సౌకర్యార్థం రాత్రి వేళల్లో తిరిగే సర్వీసులను రద్దు చేసి పగటి పూట సర్వీసులను కొనసాగించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా రాజమండ్రి సర్వీస్‌ను కూడా సుమారు 4 గంటలు ఆలస్యంగా నడుపుతుడడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కేవలం మూడు బస్సులే..
వాజేడు మండలానికి కేవలం మూడు బస్సులు మాత్రమే వస్తున్నాయి. ఒకటి భద్రాచలం డిపోకు చెందిన రాజమండ్రి పేరూరు సర్వీసు కాగా వరంగల్ డిపోకు చెందిన పేరూరు, వాజేడు సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మూడు సర్వీసులకే వాజేడు మండలం పరిమితమయ్యాయి.
ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలు
అసలే పరీక్షల కాలం.. సరైన రవాణా సౌకర్యాం లేక విద్యార్థులు ఆలస్యంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి వస్తోంది. దీంతో సంవత్సరమంతా కష్టపడి చదివి సమయానికి కేంద్రానికి చేరుకోలేక పరీక్షను సరిగా రాయలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకునేందుకు ఆటోలు ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేట్ వాహనాలతో జేబులకు చిల్లు పడుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో వాజేడు, వెంకటాపురం ఉన్నప్పుడు భద్రాచలం నుంచి ఎక్కువ సంఖ్యలో బస్సు సర్వీలు నడిచాయి.
అందులో పేరూరు–హైదరాబాద్ సర్వీసులతో భద్రాచలం డిపోనకు ఎక్కువ ఆదాయం వచ్చేది. జిల్లాల విభజన తర్వాత వాజేడు, వెంకటాపురం రెండు మండలాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లాయి. దీంతో బస్సు సర్వీసులను కుదించారు. వరంగల్ , భూపాలపల్లి బస్సు డిపోల నుంచి మండలానికి బస్సు నడుపడం లేదు. ప్రజల అభ్యర్థన మేరకు కేవలం రెండు బస్సులను వరంగల్ డిపో నుంచి నడుపుతున్నారు. మరిన్ని బస్సులను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment