
భద్రాద్రి రామాలయ ఆవరణలో ఏపీకి చెందిన వృద్ధురాళ్లు, ఉద్యోగులు
భద్రాచలం: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఔదార్యంతో కొందరు అనాథ వృద్ధురాళ్లు భద్రాచలం రామయ్య దర్శనం చేసుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వావివలస గ్రామానికి చెందిన పాలూరు సిద్ధార్థ తన భార్య సుధారాణితో కలిసి ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అనాథలు, దివ్యాంగ మహిళలకు అండగా ఉంటూ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.
అక్కడ నివసిస్తున్న కొందరు వృద్ధురాళ్లకు భద్రాచలం రామయ్యను దర్శించుకోవాలనేది చిరకాల కోరిక. దీంతో సిద్ధార్థ తన పరిచయస్తుల ద్వారా విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సజ్జనార్ విశాఖపట్నం నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి పర్ణశాల, తిరిగి విశాఖపట్నం వరకు పూర్తిగా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. ఈమేరకు 20 మంది వృద్ధురాళ్లు గురువారం ఉదయం భద్రాచలం చేరుకుని పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించాక రామయ్యను దర్శించుకున్నారు.
అనంతరం పర్ణశాలను కూడా సందర్శించారు. వీరికి భద్రాచలం పట్టణ సీఐ టి.స్వామి భోజన, వసతి, ఆలయ ఈవో శివాజీ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తమ చిరకాల కోరిక తీర్చిన ఎండీ సజ్జనార్, ఏర్పాట్లు చేసిన అధికారులకు వృద్ధురాళ్లు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపి విశాఖ తిరుగు పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment