నో ‘హెల్ప్’ | No Help | Sakshi
Sakshi News home page

నో ‘హెల్ప్’

Published Fri, Jan 29 2016 1:13 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

No Help

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎస్‌హెచ్‌జీల రుణ లక్ష్యాల్ని భారీగా రూపొందిస్తూ గొప్పలకుపోతున్న బ్యాంకులు.. రుణ వితరణలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఈ ఏడాదిలో రూ.343.30 కోట్ల మేర రుణాలివ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.175.82 కోట్లు పంపిణీ చేశారు. వార్షిక లక్ష్యంలో కేవలం 51.21శాతం మాత్రమే పురోగతి సాధించారు. వాస్తవానికి వార్షిక సంవత్సరం ప్రారంభం నుంచే నెలవారీ లక్ష్యాల్ని సాధించాలి. కానీ తొలి రెండు త్రైమాసికాల్లో రుణ వితరణలో తీవ్ర జాప్యం చేస్తున్న బ్యాంకులు ఆతర్వాత లక్ష్య సాధనవైపు అడుగులు వేస్తున్నాయి.
 
  దీంతో సకాలంలో రుణాలందని మహిళా సంఘాల సభ్యులు ప్రైవేటు అప్పుల బాట పడుతున్నారు. ఆ తర్వాత బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని చెల్లిస్తున్నారు. దీంతో మహిళలకు వడ్డీ భారం తడిసిమోపెడవుతోంది. అంతేకాకుండా ఆర్థికాభివృద్ధిలో వెనకబడుతున్నారు. తాజాగా చివరి రెండు నెలల్లో రుణ పంపిణీ వేగం పెంచినప్పటికీ.. మిగిలిన లక్ష్యం సాధించడం కష్టమనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా లక్ష్యసాధన కోసం మహిళలకు రుణాల్ని అంటగడితే ఆ మొత్తాన్ని పద్ధతి ప్రకారం వినియోగించుకోరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఆర్నెల్లుగా జాడలేని ‘వడ్డీరాయితీ’
 స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల్ని అందిస్తున్నట్లు సర్కారు చెబుతున్నప్పటికీ.. ఆ మేరకు నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. రుణ చెల్లింపుల సమయంలోనే మహిళలు వడ్డీ చెల్లిస్తున్నారు. సకాలంలో చెల్లింపులు పూర్తి చేసినవారికి తిరిగి చెల్లించిన వడ్డీని వారి ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే ఈ చెల్లింపుల ప్రక్రియలో గందరగోళం నెలకొంటోంది. రుణ చెల్లింపులు పూర్తయిన వెంటనే ప్రభుత్వం వడ్డీ రాయితీ నిధులు ఇవ్వడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 24,968 స్వయం సహాకయ సంఘాలకు గతేడాది జులై నుంచి వడ్డీ రాయితీ నిధులు ఇవ్వాల్సి ఉంది. తాజాగా ఈ బకాయిలు రూ.20.47 కోట్లకు పెరిగాయి. ఈ మొత్తాన్ని మహిళలు వ్యక్తిగతంగా భరించగా.. ఆర్నెల్లుగా రాయితీ కోసం ఎదురు చూస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement