మహిళా పోలీస్‌ స్టేషన్లా..అవసరం లేదు! | No need of women police station | Sakshi
Sakshi News home page

మహిళా పోలీస్‌ స్టేషన్లా..అవసరం లేదు!

Published Wed, Oct 11 2017 3:22 AM | Last Updated on Wed, Oct 11 2017 3:22 AM

No need of women police station

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో మహిళా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పోలీసు శాఖ స్పష్టం చేసింది. పోలీస్‌ నియామకాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో వాటి ఉపయోగం పెద్దగా అవసరం లేదని భావిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. వేధింపులు, వరకట్న కేసులు, విడాకులు.. ఇలా మహిళలకు సంబంధించిన కేసుల విచారణ కోసం పాత జిల్లాల్లో ప్రత్యేకంగా మహిళా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసు శాఖ తాజా నిర్ణయంతో ఉన్న ఈ పోలీస్‌ స్టేషన్లు కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో పాత జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌లో ఒక్కో మహిళా పోలీస్‌ స్టేషన్‌ చొప్పున ఏర్పాటు చేశారు. అయితే కొత్త జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదు. దీనిపై పోలీస్‌ శాఖను వివరణ కోరగా.. ఇక మహిళా పోలీస్‌స్టేషన్లు అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో మహిళా పోలీస్‌ స్టేషన్ల వ్యవస్థపై పోలీస్‌ శాఖ నిర్ణయం వివాదాస్పదమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. 

రిజర్వేషన్‌తో సంబంధం ఏంటి?
గృహిణులు, యువతులు, మహిళలు.. వేధింపులు, సమస్యలతో పోలీస్‌ స్టేషన్లకు వెళ్తుంటారు. అయితే మహిళా కానిస్టేబుళ్లు, అధికారులు ఉంటేనే వారితో సమస్య చెప్పుకునేందుకు, కేసుల వ్యవహారంపై చర్చించుకునేందుకు బాధిత మహిళలకు సులభంగా ఉంటుంది. ఇలా కాకుండా సాధారణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మహిళలు తమ సమస్య చెప్పుకోవడం ఎలా సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్‌కు, నూతన జిల్లాల్లో మహిళా పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు లింకు పెట్టడంపై పోలీస్‌ శాఖలో తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతోంది.

పోలీస్‌ ఫోర్స్‌లో 3.13 శాతమే
ప్రస్తుతం రాష్ట్ర పోలీస్‌ శాఖలో కేవలం 1,484 మంది మహిళా సిబ్బంది మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం పోలీస్‌ ఫోర్స్‌లో 3.13 శాతం మాత్రమే. ఇందులో కూడా కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లే ఎక్కువగా ఉన్నారు. అధికారుల విషయానికొస్తే 17 మంది మహిళా ఇన్‌స్పెక్టర్లు, 34 మంది ఎస్‌ఐలు, 58 మంది ఏఎస్‌ఐలు ఉన్నారు. పాత జిల్లాల పరిధిలోని 14 మహిళా పోలీస్‌ స్టేషన్లను ఒకసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో మినహా మిగతా ప్రాంతాల్లో మహిళా అధికారులకు మహిళా పోలీస్‌ స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓలుగా పోస్టింగ్స్‌ ఇవ్వలేదు. కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్‌లోని హన్మకొండలో పురుషులనే ఎస్‌హెచ్‌ఓలుగా నియమించారు. సైబరాబాద్, సంగారెడ్డి మహిళా పోలీస్‌స్టేషన్లకు ఇన్‌స్పెక్టర్‌ అంటూ లేరు.

మహిళల కేసుల పరిష్కారం..?
మహిళా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయని పక్షంలో శాంతి భద్రతల పోలీస్‌ స్టేషన్‌ అధికారి నేతృత్వంలోనే మహిళా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తారు. అయితే బందోబస్తులు, నేరాల నియంత్రణ, ఇతరత్రా వ్యవహారాలతోనే సంబంధిత స్టేషన్‌ హౌస్‌ అధికారి బిజీగా ఉంటారు. మరి మహిళల సంబంధిత కేసులను ఎప్పుడు పర్యవేక్షిస్తారు, పరిశీలిస్తారనే దానిపై ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ శాఖ నేతృత్వంలో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. వీటి పర్యవేక్షణ బాధ్యత మహిళా పోలీస్‌ స్టేషన్లకు అప్పగిస్తే ప్రత్యేకమైన విభాగం ఎప్పుడూ మహిళల రక్షణ, బాధ్యతపైనే పని చేస్తుందన్న వాదనను పట్టించుకోకపోవడం గమనార్హం. 

హెల్ప్‌ డెస్క్‌తో సరి..?
మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఒక ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ అధికారితోపాటు మరో ఇద్దరు ఎస్‌ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, పది మంది వరకు కానిస్టేబుళ్లు ఉంటారు. రిజర్వేషన్‌ పెంపుతో నూతన పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటైతే వారిని ఎస్‌హెచ్‌ఓలుగా నియమిం చవచ్చు. అలా కాదని కొత్త జిల్లాల్లో మహిళా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయకుండా, శాంతి భద్రతల కోసం పోలీస్‌ స్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ ప్రకారం హెల్ప్‌ డెస్కుల్లో కేవలం కానిస్టేబుల్‌/హెడ్‌కానిస్టేబుల్‌ ర్యాంకు సిబ్బందిని కూర్చోబెట్టాలని యోచిస్తున్నారు. మహిళా ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు ఉండరు.

33% రిజర్వేషన్‌ అమలు నేపథ్యంలో అవసరం లేదని వెల్లడి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement