ఏదీ.. ఆసరా..!
- అర్హులకూ మంజూరు కాని పింఛన్లు
- ఆందోళన చెందుతున్న బాధితులు
జహీరాబాద్ : అర్హులైన వారికి పింఛన్లు మంజూరు కాక పోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అనేక మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. జహీరాబాద్ మండలంలో పింఛన్లు మంజూరు కాని వారు ఎంతో మంది మిగిలి పోయారు. పింఛన్ల కోసం అనేక మార్లు దరఖాస్తు పెట్టుకున్నా మంజూరు కావడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఒక్క రంజోల్ గ్రామంలోనే 150 మందికి పైగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ విషయమై పలు మార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి వెళ్లి కూడా దరఖాస్తు చేసినా మంజూరు కావడంలేదని పలువురు విచారం వ్యక్తం చేశారు. ఏ ఆధారం లేకుండా ఉన్న తమకెందుకు పింఛన్లు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. పూట గడవని స్థితిలో ఉన్న తమకు పింఛన్లు మంజూరు చేయాలని పలువురు వృద్ధులు అధికారులను వేడుకుంటున్నారు. ఇప్పటికీ ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది వరకు పింఛన్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
చూసేవారు లేక అవస్థలు పడుతున్నా..
నన్ను చూసే వారు లేక అవస్థలు పడుతున్నా.. ఏ పని చేసేందుకు నాకు చేతకాదు. కనీసం పింఛనైనా వస్తే ఆసరాగా ఉంటుంది. నా పరిస్థితి చూసైనా పింఛను మంజూరు చేసి పుణ్యం కట్టుకోండి. పింఛన్ మంజూరు కోసం నాకు తిరగనీకె చేతకావడం లేదు. జర అధికారులే దయ చూడాలే..
కాళ్లరిగేలా తిరుగుతున్నా..
పింఛన్ మంజూరు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఇప్పటి వరకు మంజూరు కాలే. మా లాంటి ముసలోళ్లను తిప్పలు పెట్టడం తగదు. నా పరిస్థితిని చూసైనా మంజూరు చేయుండి. పింఛన్ వస్తే నాకు ఆసరా ఉంటది.
-నర్సమ్మ, గౌసాబాద్