కంటి వెలుగుకు స్పందన కరువు  | No Response To Kanti Velugu | Sakshi
Sakshi News home page

కంటి వెలుగుకు స్పందన కరువు 

Published Thu, Aug 23 2018 9:25 AM | Last Updated on Thu, Aug 23 2018 9:25 AM

No Response To Kanti Velugu - Sakshi

కంటి అద్దాలను పంపిణీ చేస్తున్న జిల్లా ఉప వైద్య అధికారి సైదులు (ఫైల్‌)  

తాండూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు పథకం ప్రజల నుంచి ఆదరణ కరువవుతోంది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజా ప్రతినిధుల అలసత్వంతో కంటి వెలుగు మసకబారుతోంది. కంటి వెలుగు వైద్య శిబిరంలో 360 మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే శిబిరాలకు ప్రజలు నావ మాత్రంగా వస్తున్నారు. అయితే దీనికి కారణం శిబిరాల్లో కంటి పరీక్షలు వైద్య నిపుణులతో కాకుండా ఆయూష్, అఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌లతో చేయిస్తుండడంతో ప్రజలు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ పథకం అమలై వారమవుతున్నా కంటి శస్త్రచికిత్సలకు ప్రభుత్వం ఆస్పతులను అందుబాటులోకి తీసుకురాకపోవడం గమనార్హం.

జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న 9.40 లక్షల మందికి కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు చేసేందుకు 22 వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. ఈనెల 15వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఒక శిబిరంంలో రోజుకు 360 మందికి కంటి పరీక్షలు (స్క్రీనింగ్‌) చేయాలి. అంటే జిల్లాలో 22 కంటి వెలుగు శిబిరాల్లో రోజుకు 7,920 మందికి కంటి పరీక్షలు చేయాలి. 15వ తేదీ నుంచి మంగళవారం వరకు 55,450 మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే ఆ పరీక్షలు దారిదాపులోకి కూడా చేరుకోలేదు. ఇప్పటివరకు శిబిరాల్లో 13,795 మందికి మాత్రమే కంటి పరీక్షలు చేసినట్లు జిల్లా కంటి వెలుగు నిర్వహణ అధికారి చెప్పారు.  

ఆయూష్‌ వైద్యులతో పరీక్షలు 

కంటి వెలుగు కార్యక్రమంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాల్లో కంటి వైద్య నిపుణులు కరువయ్యారు. కంటి వైద్యులతో శిబిరాలను నిర్వహించాల్సి ఉం డగా రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమ్‌ (ఆర్‌బీఎస్‌కే) పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆయూష్‌ వైద్యులు, పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌లతో శిబిరాలు కొనసాగిస్తున్నారు.  

శస్త్ర చికిత్సలకు ఆస్పపత్రులేవీ..

కంటి వెలుగు ప్రారంభమై వారమైంది. అయితే ఇప్పటివరకు శస్త్ర చికిత్సల కోసం ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురావడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. శిబిరాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని 1,648 మందిని శస్త్ర చికిత్సల కోసం గుర్తించారు. అయితే కంటి శస్త్ర చికిత్సల కోసం ఆస్పత్రుల వివరాలు పొందుపర్చలేదు. దీంతో కంటి పరీక్షలు చేసుకున్న వారు శస్త్ర చికిత్స కోసం రిఫర్‌ చీటీలను తీసుకుని ఇంటి బాట పడుతున్నారు.  

5 ఆస్పత్రులు అందుబాటులో 

కంటి వెలుగు రోజురోజుకు ఆదరణ వస్తోంది. కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటి శస్త్ర చికిత్సలు చేయించేందుకు రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తాం. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సర్జన్‌ను నియమించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. కంటి శస్త్ర చికిత్సలను చేసేందుకు మొత్తం 5 ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తాం.    – మహేశ్, కంటి వెలుగు జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి

ఆదరణ కరువు  

జిల్లాలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాల్లో ఇప్పటివరకు 13,795 మందికి పరీక్షలు చే శారు. వీరిలో పురుషులు 6,081, మహిళలు 7, 714 మందికి కంటి పరీక్షలు నిర్వహించచారు. ఎస్సీలు 2,618 మంది, ఎస్టీలు 1,315, బీసీలు 7,430, ఓసీలు 1,365, మైనార్టీలు 1,069 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 1,381 మందికి కంటి అద్దాలను అందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement