ఎంజీబీఎస్‌లోని పార్కింగ్ ప్రదేశంలో కిక్కిరిసిన వాహనాలు(ఫైల్)
సాక్షి,సిటీబ్యూరో: బెంగుళూరులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంతో దేశంలోని పలు ముఖ్య నగరాలు మేల్కొంటున్నాయి. అయితే హైదరాబాద్‌లో ఆపరిస్థితి కానరావటం లేదు. బెంగళూరులోని ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరుగుతున్న యలహంక ఎయిర్‌బేస్ స్టేషన్ సమీపంలో పార్కింగ్ ప్రాంతంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 3 వందల కార్లు కాలిపోయాయి.. భాగ్యనగరంలోనూ ఈ తరహా ముప్పు పొంచి ఉంది. నగరంలోని అనేక పార్కింగ్ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థలు లేకపోవడంతో అనుకోని ఘటన సంభవిస్తే భారీగా ఆస్తినష్టం వాటిల్లేందుకు ఆస్కారం ఉంది.
ముఖ్య ప్రదేశాల్లోనూ సేఫ్టీ కరువు..
నగరంలో ప్రధాన కేంద్రాలైన రవీంద్రభారతి, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, పాటు వివిధ పార్కులు, వాణిజ్య సముదాయాల భవనాల్లో వాహనాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో నిర్వాహకులు 8 గంటల సమయానికి నిర్ణీత రుసుము వసూలు చేస్తుంటారు. ధరల విషయంలో కచ్చితంగా ఉంటున్న సంబంధిత కాంట్రాక్టర్లు వాహనాల భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
కొందరు వ్యక్తులు చోరీ చేసిన వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లో ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు వీలుగా ఇటీవల పోలీసులు పార్కింగ్ ప్రదేశాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఈ విషయంలో కొంతవరకు భద్రత ఉన్నా.. ఆయా ప్రాంతాల నిర్వహణ మాత్రం అత్యంత ఘోరంగా ఉంటోంది.
♦ నగరంలోని రవీంద్రభారతి, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, జలవిహార్, సెక్రటరియేట్ తదితర ప్రాంతాలతో పాటు చాలాచోట్ల పార్కింగ్ ప్రాంగణాలకు ఎలాంటి షెడ్లు ఉండడం లేదు. ఎండైనా, వానైనా వాహనాలు పాడైపోవాల్సిందే. వేసవిలో ఎండల కారణంగా వాహనాలు వేడెక్కి తగలబడే ప్రమాదం ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
♦ కొన్ని పార్కింగ్ ప్రదేశాల్లో మొక్కుబడిగా కొంత ప్రాంగణానికి మాత్రం షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
♦ పార్కింగ్ ప్రదేశాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ వాహనాలను ఉంచేందుకు వీలుగా ఏ మాత్రం ఖాళీ లేకుండా వాహనాలతో నింపేస్తున్నారు.
దీంతో ఒక్క వాహనం ప్రమాదానికి గురైనా పక్కనున్నవి కూడా వేగంగా తగలబడేందుకు అవకాశం ఉంది.
♦ పార్కింగ్ ప్రదేశాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే మంటలను అదుపులోకి తెచ్చేందుకు వీలుగా ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయడం లేదు. నీటిసంపులుగానీ, ఫైర్ ఎక్స్‌ట్వింగ్విషర్లు, కనీసం ఇసుకబక్కెట్లు కూడా అందుబాటులో ఉంచడం లేదు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పార్కింగ్ ప్రదేశాల నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్నవారు వారికి కేటాయించిన ప్రదేశంతోపాటు దానికి సమీపంలో వాహనాలను నిలిపినా అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థలు మాత్రం ఏర్పాటు చేసుకోవడంలేదు.
రోడ్లపైనే పార్కింగ్ ..
నగరంలోని అనేకచోట్ల పార్కింగ్ ప్రాంతాలున్నా.. రుసుముల కారణంగా చాలామంది వాటిని వినియోగించడం లేదు. పలు సందర్భాల్లో రహదారి పక్కనే నిలిపేస్తున్నారు. అనధికారిక పార్కింగ్‌ల కారణంగా ట్రాఫిక్‌కు తరచూ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. లుంబినీ పార్కు పార్కింగ్ స్థలంలో మృతువీరుల స్మృతి భవనం నిర్మాణ పనుల నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్‌లో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. పర్యాటకులు అంతదూరంలో వాహనాలు నిలిపి లుంబినీ పార్కుకు రాలేక పార్కు ముందుభాగంలోని పుట్‌పాత్‌పైనే వాహనాలు నిలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment