వికారాబాద్, న్యూస్‌లైన్:ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలుచేయాలని, అభ్యర్థుల ప్రచారం, ఖర్చుపై నిఘా ఉంచాలని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడాన్ని నిరోధించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను స్పష్టంగా ఆదేశించారు. నిఘాకు అవసరమైన కెమెరాలు, వీడియో కెమెరాలను సమకూర్చుకొని ఎన్నికలు ప్రశాం తంగా జరిగేందుకు కృషి చేయాలన్న ఆయన ఆదేశాలను వికారాబాద్ సెగ్మెంట్‌లో అంతగా పట్టించుకుంటున్నట్టు కన్పించడం లేదు.
కెమెరాలు పగలే పనిచేస్తాయి...
వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సబ్ కలెక్టర్ ఆమ్రపాలి నియోజకవర్గంలో నిఘా కోసం ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారం, సభలతో పాటు, వాహనాల తనిఖీ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే సమయంలో ఫొటోలు తీయడంతో పాటు వీడియో చిత్రీకరణ కోసం కొత్తగా ఆరు కెమెరాలను రూ.30వేల ఖర్చుతో కొనుగోలు చేయించారు.
అయితే ఈ కెమెరాలు పగటిపూట బాగానే పనిచేస్తున్నా రాత్రిపూట సమస్యలు తలెత్తుతున్నాయని సంబంధిత ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల సిబ్బంది వాపోతున్నారు. రాత్రివేళ ఓటర్లను ప్రలోభపెట్టే సంఘటనలు తమ దృష్టికి వస్తున్నా చిత్రీకరిద్దామంటే కెమెరాలు పనిచేయడం లేదంటున్నారు. ఇదే విషయాన్ని ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నతాధికారి దృష్టికి తీసుకుపోగా... ఆ కెమెరాలతోనే సర్దుకుపోవాలని సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, ఈ విషయమై జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ ఈ నెల 7న స్పందిస్తూ నాణ్యతలేని కెమెరాలను రాత్రిపూట వాడొద్దని, ప్రైవేటుగా వీడియో కెమెరాలను అద్దెకు తీసుకొని ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వారం రోజులవుతున్నా కలెక్టర్ ఆదేశాలను వికారాబాద్‌లో ఎన్నికల అధికారులు అమలు చేస్తున్న దాఖలాలు లేవు.మరోవైపు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలూ వికారాబాద్‌లో అమలుకు నోచుకోవడం లేదు. ప్రైవేట్ వాహనాలు ఉన్న వారు వాటిని వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి ఆమ్రపాలి ఆదేశించారు. అయితే ఎన్నికల విధులకు వాడుతున్న సొంత వాహనాలకు సరిపడ డీజిల్ ఇవ్వడం లేదని పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిఘా అంతంతమాత్రమే!
Published Thu, Apr 17 2014 12:28 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement