పసుపు బోర్డు లేనట్లే..
► మిర్చి పరిశోధన కేంద్రంపై జిల్లా రైతుల ఆశలు
► సిద్ధంగా ఉన్న 90 ఎకరాల భూమి
► కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన అధికార యంత్రాంగం
సాక్షి, వరంగల్ రూరల్: వ్యవసాయపరంగా రాష్ట్రం లోనే అగ్రగామిగా ఉన్న వరంగల్ రూరల్ జిల్లాలో ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలు గణనీ యమైన స్థాయిలో పండుతున్నాయి. ఈ నేపథ్యం లో జిల్లాలో మిర్చి పరిశోధన కేంద్రంతో పాటు పసు పు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతోకా లం నుంచి ఉంది. మిర్చి బోర్డు ఏర్పాటుకు గతంలోనే ఖానాపురం మండలం అశోక్‌నగర్ వద్ద 90 ఎకరాల భూమి సేకరించారు. నాలుగు నెలల క్రితం కలెక్టర్ల సదస్సులో మిర్చి బోర్డుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు అందుకు అనుగుణంగా కేంద్రానికి నివేదిక పంపారు.
అలాగే జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో మరో కీలకమైన వాణిజ్య పంట పసుపు గణనీయంగా పండుతుండడంతో ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ మం త్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్పైసెస్ డెవలప్‌మెంట్ బోర్డు పరిధిలో ఉన్న 51 పంటల్లో పసుపు కూడా ఉన్నందున ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కుదరదని చెప్పారు. అవసరాన్ని బట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్పైస్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకుంటే సహకరిస్తామని తెలిపారు.
రైతుల కల నెరవేర్చాలి..
మిర్చి పంట విషయానికి వస్తే జిల్లా రైతులు పండించే మిర్చి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రైతుల పెట్టుబడులు తగ్గేలా, మిర్చి పంట అభివృద్ధి కోసం పరిశోధన కేంద్రం మాత్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మిర్చి పరిశోధన కేంద్రానికి సంబంధించి ఇప్పటివరకు 90ఎకరాలు స్థలం సేకరించడంతో పాటు కేంద్రం అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురూ చూస్తోంది. ఈ నేపథ్యంలో మిర్చి పరిశోధన కేంద్రం కల నెరవేర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.