Mirchi Research Center
-
హామీ ఏమాయే..?
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మొదటి హామీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. కేవలం కాగితాలకే పరిమితమైంది. రూరల్ జిల్లా వ్యవసాయాధారిత జిల్లాగా పేరొందింది. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక జిల్లాలో ఉన్న పరిస్థితి, వనరుల గురించి జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎం నివేదికలను కోరారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరకాల నియోజకవర్గం గూడెప్పాడ్‌లో పెద్ద కురగాయల మార్కెట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్థల పరిశీలన చేయాలని ఆదేశించారు. అలాగే నర్సంపేట ప్రాంతంతో మిర్చి రీసెర్చ్ సెంటర్ చేస్తానని తొలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇంతవరకూ ఊసేలేదు.. జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని గూడెప్పాడ్‌లో కూరగాయలు రైతులు బాగా పండిస్తారు. గూడెప్పాడ్ వ్యవసాయ మార్కెట్ ఐదెకరాల విస్తీర్ణంలో ఉంది. మరో ఐదెకరాల భూమిని ఆ మార్కెట్‌కు పక్కనే కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నర్సంపేట పరిసర ప్రాంతాలు, మహబూబాబాద్ జిల్లాలో మిర్చి పంట పండిస్తారు. ఈ మేరకు అధికారులు గూడెప్పాడ్‌లో కూరగాయల మార్కెట్, నర్సంపేటలో మిర్చి సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.. ప్రకటించి దాదాపు రెండేళ్లయినా ఇంతవరకు ముందుకు జరగడం లేదు. మూడు జిల్లాలకు అనువైన ప్రాంతం.. హైదారాబాద్ తరువాత వరంగల్ పెద్ద నగరంగా గుర్తింపు ఉంది. నగరంలో పెద్ద మార్కెట్ ఏర్పాటు చేసేందుకు స్థలం కొరత ఉంది. నగరానికి దాదాపు 14 కిలో మీటర్ల దూరంలోనే గూడెప్పాడ్ ఉండడంతో ఎంపిక అనువైందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మూడు జిల్లాలకు అనువైన ప్రాంతంగా గూడెప్పాడ్ ఉంది. వరంగల్ అర్బన్, రూరల్, భూపాలపల్లి జిల్లాలకు మధ్యలో ఉంటుంది. మార్కెట్ ఏర్పాటు చేస్తే అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక్కడ పండి ంచే రైతులతో పాటు ఇతర ప్రాంతాలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూరగాయలు తరలించవచ్చనే ఆలోచనతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. స్థల సేకరణ.. తెలంగాణలో పత్తి, మిర్చి రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థల సేకరణతో సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత నిధులు మంజూరు బాధ్యత కేంద్రానిది. పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో స్థల సేకరణ విషయంలో అడుగు ముందుకు పడలేదు. మరోవైపు మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు దాదాపు వంద ఎకరాలకు పైగా స్థలం అససరం అవుతుంది. దీని కోసం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట సమీపంలో అశోక్ నగర్ వద్ద సర్వే నంబరు 265/ఏలో 90 ఎకరాల స్థలాన్ని రెవెన్యూశాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్పందన లేదు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీనే అమలు కాకపోవడంతో సర్వత్రా చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. -
పసుపు బోర్డు లేనట్లే..
► మిర్చి పరిశోధన కేంద్రంపై జిల్లా రైతుల ఆశలు ► సిద్ధంగా ఉన్న 90 ఎకరాల భూమి ► కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన అధికార యంత్రాంగం సాక్షి, వరంగల్ రూరల్: వ్యవసాయపరంగా రాష్ట్రం లోనే అగ్రగామిగా ఉన్న వరంగల్ రూరల్ జిల్లాలో ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలు గణనీ యమైన స్థాయిలో పండుతున్నాయి. ఈ నేపథ్యం లో జిల్లాలో మిర్చి పరిశోధన కేంద్రంతో పాటు పసు పు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతోకా లం నుంచి ఉంది. మిర్చి బోర్డు ఏర్పాటుకు గతంలోనే ఖానాపురం మండలం అశోక్‌నగర్ వద్ద 90 ఎకరాల భూమి సేకరించారు. నాలుగు నెలల క్రితం కలెక్టర్ల సదస్సులో మిర్చి బోర్డుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు అందుకు అనుగుణంగా కేంద్రానికి నివేదిక పంపారు. అలాగే జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో మరో కీలకమైన వాణిజ్య పంట పసుపు గణనీయంగా పండుతుండడంతో ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ మం త్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్పైసెస్ డెవలప్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న 51 పంటల్లో పసుపు కూడా ఉన్నందున ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కుదరదని చెప్పారు. అవసరాన్ని బట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకుంటే సహకరిస్తామని తెలిపారు. రైతుల కల నెరవేర్చాలి.. మిర్చి పంట విషయానికి వస్తే జిల్లా రైతులు పండించే మిర్చి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రైతుల పెట్టుబడులు తగ్గేలా, మిర్చి పంట అభివృద్ధి కోసం పరిశోధన కేంద్రం మాత్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మిర్చి పరిశోధన కేంద్రానికి సంబంధించి ఇప్పటివరకు 90ఎకరాలు స్థలం సేకరించడంతో పాటు కేంద్రం అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురూ చూస్తోంది. ఈ నేపథ్యంలో మిర్చి పరిశోధన కేంద్రం కల నెరవేర్చాలని అన్నదాతలు కోరుతున్నారు. -
నేడు జిల్లాకు మంత్రి ‘పోచారం’
ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటన అశోక్‌నగర్‌లో మిర్చి పరిశోధన కేంద్రం స్థల పరిశీలన హన్మకొండ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట మండలాల్లో ఏకధాటిగా ఉదయం నుంచి రాత్రి వరకు క్షేత్రస్థాయి పరిశీలనలు, సమీక్షలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు దుగ్గొండి మండలం గొల్లపల్లి గ్రామంలో సేంద్రియ పద్ధతిలో నిర్వహిస్తున్న ఆదర్శ రైతు తోట మల్లికార్జున గుప్తకు చెందిన 130 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం చెన్నారావుపేట మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అక్కడ బహిరంగ సభ నిర్వహించి, లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, హిటాచీ యంత్రాన్ని అందజేయనున్నారు. తర్వాత ఖానాపురం మండలంలోని అత్యంత కీలమైన పాకాల సరస్సును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పాకాల సమీపంలోని గిరక తాటిచెట్లను మంత్రి పరిశీలించనున్నారు. అనంతరం నర్సంపేటలోని ఓ ఫంక్షన్హాల్లో పీఏసీఎస్ సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తర్వాత వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మిర్చి పరిశోధన కేంద్రం స్థల పరిశీలన.. ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ వద్ద ఏర్పాటు చేయనున్న మిర్చి పరిశోధన కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని మంత్రి పోచారం పరిశీలించనున్నారు. మిర్చి పరిశోధన కేంద్రం కోసం ఇప్పటికే అశోక్‌నగర్‌లో 90 ఎకరాల స్థలం కేటాయించారు. ఇందుకు సంబంధించి డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపాలని కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ భూమి అటవీశాఖ ఆధీనంలో ఉండడంతో ఇందుకు సంబంధించి మంత్రి అన్ని వివరాలు సేకరించనున్నారు. మంత్రి పోచారం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.