మహిళా మంత్రి లేని కేసీఆర్ కేబినెట్
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన11 మందిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం. మహిళా కోటాలో కొండా సురేఖ లేదా పద్మాదేవేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. సామాజిక కోణంలోనే మహిళలకు పదవి ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా మహిళలకు కేసీఆర్ ప్రాతినిథ్యం కల్పిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఒక ఉద్యోగ సంఘాల నేతలకు కేసీఆర్ నిరాశ మిగిల్చారు. స్వామిగౌడ్ కు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. మహబూబ్నగర్ నుంచి గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కు మొండిచేయి చూపారు. అలాగే మంత్రి పదవులు దక్కుతాయని ఎదురుచూసిన మరి కొంతమందికి నిరాశే ఎదురయింది. కొప్పుల ఈశ్వర్, సి.లక్ష్మారెడ్డి కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించారు. అయితే వీరిద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మంత్రివర్గంలో మిగిలిన ఖాళీలను రాబోయే నాలుగైదు రోజుల్లోనే భర్తీ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల ఆశలు మళ్లీ చిగురించాయి.