ఓట్లాటలో..ముగిసిన మున్సిపోల్స్‌ నామినేషన్ల పర్వం | Nominations Complete in Rangareddy And Medchal | Sakshi
Sakshi News home page

ఓట్లాటలో..ముగిసిన మున్సిపోల్స్‌ నామినేషన్ల పర్వం

Published Sat, Jan 11 2020 9:59 AM | Last Updated on Sat, Jan 11 2020 9:59 AM

Nominations Complete in Rangareddy And Medchal - Sakshi

సాక్షి,మేడ్చల్‌జిల్లా: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 640 డివిజన్లు, వార్డులకు మొత్తం 5,578 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన ఘట్టం ముగియడంతో కొందరు నేతలు ఓట్ల వేటలో పడగా, మరికొందరు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు శనివారం పరిశీలిస్తారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అన్ని వివరాలు సమర్పించిన అభ్యర్థుల నామినేషన్లే చెల్లుబాటవుతాయి. లేదంటే వాటిని తిరస్కరిస్తారు. చెల్లిన నామినేషన్ల వివరాలను ఇదే రోజు వెల్లడిస్తారు. తిరస్కరించిన వాటిపై 12వ తేదీన అభ్యంతరాలు స్వీకరించి.. 13న పరిష్కరిస్తారు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను  ఉపసంహరించుకోవచ్చు. తర్వాత తుది పోరులో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటించి వారికి గుర్తులు కేటాయిస్తారు. ముఖ్యమైన పోలింగ్‌ ఘట్టం ఈ నెల 22న ఉంటుంది. 

మేడ్చల్‌ జిల్లాలో ఇలా..
జిల్లాలోని నాలుగు నగరపాలక సంస్థల్లో 115 డివిజన్లకు 1,257 నామినేషన్లు అందగా, 9 మున్సిపాలిటీలపరిధిలోని 174 వార్డులకు 1,506 నామినేషన్లు దాఖలయ్యాయి. కార్పొరేషన్లయిన బోడుప్పల్‌లో 377, ఫీర్జాదిగూడ 252, జవహర్‌నగర్‌ 268, నిజాంపేట 340 నామినేషన్లు వచ్చాయి. పురపాలక సంఘాలైన దమ్మాయిపేటలో 117, నాగారం 174, పోచారం 129, ఘట్‌కేసర్‌ 151, తూముకుంట 151, కొంపల్లి 213, గుండ్లపోచంపల్లి 106, మేడ్చల్‌ 223, దుండిగల్‌లో 242 నామినేషన్లు అందాయి. 

అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో
రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల్లో మొత్తం 2,815 నామినేషన్లను అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు స్వీకరించారు. చివరి రోజు 2,176 అందడం విశేషం. జిల్లాలో మూడు కార్పొరేషన్ల పరిధిలో వంద డివిజన్లు ఉండగా.. వీటికి 818 నామినేషన్లు వచ్చాయి. అలాగే, 12 మున్సిపాలిటీల్లో 251 వార్డులకు 1,997 నామినేషన్లు అందాయి. ఆదిభట్లలో 123, ఇబ్రహీంపట్నం 138, తుర్కయాంజల్‌ 198, తుక్కుగూడ 135, పెద్ద అంబర్‌పేట 241, ఆమనగల్లు 117, శంషాబాద్‌ 208, నార్సింగి 159, మణికొండ 199, షాద్‌నగర్‌ 234, శంకర్‌పల్లి 107, జల్‌పల్లి 138 నామినేషన్లు దాఖలు చేశారు. కార్పొరేషన్ల విషయానికొస్తే బడంగ్‌పేటలో 289, బండ్లగూడ 210, మీర్‌పేట 319 నామినేషన్లు అందాయి. 

మూడు వార్డులు ఏకగ్రీవం  
దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు ఏకగ్రీవమైంది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శంభీపూర్‌ కృష్ణ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు తమ్ముడే కృష్ణ. కాగా దుండిగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జనరల్‌ మహిళకు రిజర్వు కాగా, శంభీపూర్‌ కృష్ణ సతీమణి కృష్ణవేణిని అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కృష్ణవేణి 25వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రెండు వార్డులకు ఒక్కొక్క నామినేషన్‌ చొప్పున వచ్చాయి. మున్సిపాలిటీలోని 17, 18 వార్డుల నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన ముత్యాల ప్రసన్నలక్ష్మి, ఇందిరాల రమేష్‌ ఏకగ్రీమయ్యారు.

టీఆర్‌ఎస్‌లో రెబబ్స్‌ బెడద
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో రెబల్స్‌ బెడద తీవ్రంగా ఉంది. ఒకటి, రెండు మినహా మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు జనరల్‌ కేటగిరీకి రిజర్వు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మేడ్చల్‌ నియోజకవర్గంలోని ఫీర్జాదిగూడ కార్పొరేషన్‌లో 26 డివిజన్లు ఉండగా, టీఆర్‌ఎస్‌ నుంచి 100 నామినేషన్లు వేశారు. పోచారంలో 18 వార్డులుండగా, టీఆర్‌ఎస్‌ నుంచి 49 నామినేషన్లు, దమ్మాయిగూడలోని 18 వార్డులకు 37, నాగారంలో 20 వార్డులకు 55, ఘట్కేసర్‌ 18 వార్డుల్లో 77 నామినేషన్లు దాఖల య్యాయి. ఇదే పరిస్థితి నిజాంపేట్, బోడుప్పల్‌ కార్పొరేషన్లతో పాటు, కొంపల్లి, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూముకుంట తదితర మున్సిపాలిటీల్లోనూ ఉండడం మంత్రి, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారనుంది.

రంగారెడ్డి జిల్లాలో అంతే..
ఈ జిల్లాలో కూడా అధికార పార్టీకి రెబల్స్‌ బెడద తప్పటం లేదు. నగర శివారులో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉండటంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుతో వార్డుల్లో తీవ్ర పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. తుక్కుగూడ 7వ వార్డులో ఎనిమిది మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బండ్లగూడలో ఏకంగా టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆరుగురు నేతలు కాంగ్రెస్, టీడీపీ తీర్థం పుచ్చుకుని బరిలోకి దిగారు. బడంగ్‌పేట్, మీర్‌పేట్‌ కార్పొరేషన్లు, శంకర్‌పల్లి, తుర్కయాంజల్, నార్సింగి, శంషాబాద్‌ మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌లో రెబల్స్‌ బెడద తీవ్రంగా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement