ఇంటికొస్తాం..ఇచ్చిపోతాం! | Political Leaders Distributing Money in Municipal Elections | Sakshi
Sakshi News home page

ఇంటికొస్తాం..ఇచ్చిపోతాం!

Jan 21 2020 10:20 AM | Updated on Jan 21 2020 10:20 AM

Political Leaders Distributing Money in Municipal Elections - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. ఇక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెరవెనుక రాజకీయాలు..తాయిలాల జోరు ఊపందుకుంది. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చివరి నిమిషం తతంగాలకు తెరలేపారు. పట్టణాలు, కాలనీల్లో మద్యం, డబ్బు పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం వరకు చేసిన ప్రచారం ఒక ఎత్తైతే..పోలింగ్‌కు ముందు రోజు...పోలింగ్‌ రోజువ్యవహరించాల్సిన తీరుపై అభ్యర్థులు అలర్ట్‌ అయ్యారు. 

కాగా, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లో ఆరు రోజుల పాటు ఉధృతంగా సాగిన ఎన్నికల ప్రచారం, రోడ్‌షోలు, ఎన్నికల ప్రచార సభల్లో    ప్రధాన పార్టీల నేతలు పాల్గొన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ మంత్రులు మల్లారెడ్డి ,సబితా ఇంద్రారెడ్డి, మంత్రి మహామూద్‌ అలీ తదితరులు చారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు రోడ్‌షోలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ అధ్యక్షుడు టి.లక్ష్మణ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి , ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు  తదితరులు జోరుగా  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.  

తాయిలాలతో ఎర  
రెండు జిల్లాల్లోని 631 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 2,501 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. వీరంతా గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. చివరి రోజు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పెద్దఎత్తున తాయిలాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. బంధువులు, మిత్రులు, పార్టీ ముఖ్యులను రంగంలోకి దింపి..గుట్టుగా తాయిలాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నుంచి ప్రారంభించారని తెలిసింది. కొన్నిచోట్ల గంప గుత్తగా కుటుంబానికి రూ.10 వేల చొప్పున పంపిణీకి సిద్ధమవుతున్నారు. కొన్ని వార్డుల్లోనైతే కుటుంబానికి అర తులం బంగారం అందజేయటానికి హామీలు ఇస్తున్నారు. అలాగే జనరల్‌ వార్డుల్లో ఓటుకు రూ.5 వేలు పలుకుతుండగా, బీసీ రిజర్వుడ్‌ వార్డుల్లో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు పంపిణీ చేస్తున్నారని తెలిసింది. అలాగే, మద్యం బాటిళ్లు పంపిణీ చేసేందుకు వీలుగా ప్రత్యేక ప్రాంతాలు, కాలనీల్లో మద్యం డంపింగ్‌ చేసినట్లు తెలుస్తున్నది.   వార్డుల్లోని కుల సంఘాలు, కాలనీలు, అపార్టుమెంట్లు, అసోసియేషన్లకు మాత్రం ఓట్ల సంఖ్యను బట్టి హామీలిస్తున్నారని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement