టీఆర్‌ఎస్ ఐదో అభ్యర్థి బరిలోనే ఉంటారా?
ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తన ఐదో అభ్యర్థిని పోటీలో కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు కావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఆరు ఖాళీలకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. అయితే అధికార పార్టీ నాలుగు స్థానాలతో తృప్తి పడి, ఐదో అభ్యర్థిని ఉపసంహరించుకుంటే ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. కానీ, టీఆర్‌ఎస్ తనకున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని కాకుండా ‘అంకెల గారడీ’ని నమ్ముకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ మద్దతుతో ఎమ్మెల్సీ సీటుకు 2 ఓట్ల దూరంలో నిలిచిపోయిన టీడీపీ తన విజయంపై విశ్వాసంతోనే ఉంది.
కానీ, టీఆర్‌ఎస్ ఎక్కడ తమ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయిస్తుందోనన్న ఆందోళన అటు టీడీపీతోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోనూ ఉంది. దీంతో నామినేషన్ ఉపసంహరణపై సోమవారం టీఆర్‌ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ ఊపందుకుంది. మండలిలో టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో స్థానం లేకుండా చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని టీటీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, ఎమ్మెల్యేలంతా ఆత్మప్రభోదం ప్రకారం ఓట్లేయాలని టీఆర్‌ఎస్ నాయకులు కొత్త పల్లవి ఎత్తుకున్నారు.
టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే గులాబీ గూటికి చేరగా, మరో ఇద్దరు అదే బాటలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు, రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడమే తరువాయి అన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో ప్రకాశ్ గౌడ్ తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ అభ్యర్థులకే ఓటు వేస్తారన్న అంచనాలు మొదలయ్యాయి.
నామినేషన్ల ఉపసంహరణ నేడు
Published Mon, May 25 2015 4:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement
Advertisement