సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్..ఒకప్పుడు తీవ్రమైన చలితో గజగజ వణికించేది. చలిగాలుల తీవ్రత, పొగ మంచుతో ఉక్కిరిబిక్కిరి చేసేది. ఈ ఏడాది డిసెంబర్ మాత్రం గతంతో పోలిస్తే కొంత మేర ఊరటనిచ్చింది. చలి ఉన్నా గత స్థాయిలో వణికించడం లేదు. ఈసీజన్‌లో ఇప్పటి వరకునగరంలో రాత్రి వేళల్లోసాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీనికి భిన్నంగా పగటి వేళల్లో సాధారణఉష్ణోగ్రతల కంటే తక్కువనమోదవుతుండడం విశేషం. కొద్ది రోజులుగా కోమోరిన్ ప్రాంతం నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటం వల్లే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
గజగజ లేకుండానే
నగరాన్ని గజగజ వణికించే డిసెంబర్ మాసంలో ఇప్పటి వరకు 15 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలే నమోదు కాలేదు. బుధవారమైతే ఏకంగా 19.6 డి డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే ఏకంగా ఐదు డిగ్రీలు అధికం. అయితే గత చరిత్ర పరిశీలిస్తే వాతావరణ చరిత్రలో అత్యల్ప ఉష్ణోగ్రతలన్నీ డిసెంబర్ మాసంలోనే నమోదయ్యాయి. హైదరాబాద్ చరిత్రలో అత్యల్ప ఉష్ణోగ్రత 1966 డిసెంబర్ 14న 7.1 డిగ్రీలు నమోదైతే, గతేడాది డిసెంబర్ 31న 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇదిలా ఉంటే ఉపరితల ద్రోణి తీవ్రత తగ్గితే నగరానికి తూర్పు దిశ నుండి గాలుల తీవ్రత పెరిగితే జనవరి మొదటి వారంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఒక వేళ ద్రోణి తీవ్రత తగ్గకపోతే చలి తీవ్రత లేకుండానే శీతాకాలం ముగిసిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment