సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా ‘సహకార’ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డిలపై డెరైక్టర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ మేరకు ఆయా సంస్థల్లోని సగానికి పైగా డెరైక్టర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసు(ఫాం-ఎఎఎ)లు జిల్లా సహకార అధికారి(డీసీవో) సూర్యచంద్రరావుకు అందాయి.
దీంతో జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ పదవులు తమ ఖాతాలోకి వేసుకునేందుకు టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ ఇప్పటికే జిల్లా పరిషత్, అత్యధిక మండల పరిషత్‌లను కైవసం చేసుకుంది. ఇప్పుడు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమవుతోంది.
గతేడాది జరిగిన సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సొసైటీలను గెలుచుకుంది. తాజాగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సహకార సంఘాల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీన్ని టీఆర్‌ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుని ప్రతిష్టాత్మకమైన డీసీసీబీ, డీసీఎంఎస్‌లపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమైంది. డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నెల రోజులుగా రగులుతూనే ఉంది. ఎట్టకేలకు బుధవారం డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
డీసీఎంఎస్ పైనా..
డీసీఎంఎస్‌లో పది మంది డెరైక్టర్లు ఉన్నారు. ఇందులో సహకార సంఘాల చైర్మన్లు ఎన్నుకున్న డెరైక్టర్లు ఆరుగురు ఉండగా, బీ-క్లాస్ సొసైటీల నుంచి నలుగురు డెరైక్టర్లు ఉన్నారు. అయితే ఏడుగురు డెరైక్టర్లు చైర్మన్‌పై అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేసిన నోటీసును జిల్లా సహకార అధికారికి అందజేసినట్లు సమాచారం. ఏడుగురు డీసీఎంఎస్ డెరైక్టర్లు హైదరాబాద్‌లో క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. డీసీసీబీ, డీసీఎంఎస్‌లను కైవసం చేసుకునేందుకు మంత్రి రామన్న, టీఆర్‌ఎస్ అనుబంధ ఎమ్మెల్యే ఐకేరెడ్డి చక్రం తిప్పుతున్నారు.
డీసీఎంఎస్ చైర్మన్ రేసులో బోథ్ నియోజకవర్గానికి చెందిన సహకార సంఘం చైర్మన్ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, డీసీసీబీ, డీసీఎంఎస్‌లే కాకుండా మరోమూడు సహకార సంఘాల చైర్మన్లపై కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసులు జిల్లా సహకార అధికారికి అం దాయి. మంజులాపూర్, కౌట్లా (బి), తాండూర్ పీఏసీఎస్ చైర్మన్లపై ఆయా సంఘాల డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు.
ప్రత్యేక సమావేశాలకు ఏర్పాట్లు
అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన నోటీసులు రావడంతో సహకార శాఖ జిల్లా ఉన్నతాధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు డీసీసీబీ, డీసీఎంఎస్ డెరైక్టర్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు చర్యలు చే పట్టారు. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం నోటీసు వచ్చిన నెల రోజు ల్లోపు ప్రత్యేక సమావేశం నిర్వహించాలి.
ఈ సమావేశం నిర్వహించే ముందు వచ్చిన నోటీసుపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. నోటీసులో డెరైక్టర్లు చేసి న సంతకాలు సరైనవేనా కాదు.. వంటి అన్ని అంశాలు పరిశీలించాక ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా సహకార అధికారులు ముందస్తుగానే న్యాయసలహా తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించారనే అంశంపై సీనియర్ అధికారుల సలహా తీసుకుంటున్నారు. సహకార చట్టం ప్రకారం వ్యవహరిస్తామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షిప్రతినిధి’తో పేర్కొన్నారు.
తిరుగుబావుటా
Published Fri, Jul 18 2014 1:22 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement