‘గురుకులం’.. ప్రవేశాలే అయోమయం! | notification was issued to 496 Gurukul schools across the state | Sakshi
Sakshi News home page

‘గురుకులం’.. ప్రవేశాలే అయోమయం!

Published Fri, May 24 2019 5:30 AM | Last Updated on Fri, May 24 2019 5:30 AM

notification was issued to 496 Gurukul schools across the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలపై అయోమయం నెలకొంది. కేజీ టు పీజీ కార్యక్రమంలో భాగంగా గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అర్హతపరీక్ష నిర్వహించి నెలన్నర కావస్తున్నా ఇంకా ఫలితాలు వెల్లడించకపోవడం గమనార్హం. జూన్‌ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతిలో ప్రవేశంకోసం ఏప్రిల్‌ ఏడో తేదీన గురుకుల సొసైటీలన్నీ సంయుక్తంగా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సెట్‌) నిర్వహించాయి. వీటిలో వచ్చే మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ల ప్రకారం అడ్మిషన్లు కేటాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 496 గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో 232 ఎస్సీ, 87 ఎస్టీ, 142 బీసీ, 35 జనరల్‌ గురుకులాల పాఠశాలలున్నాయి. ఈ సెట్‌ ద్వారా ఐదో తరగతిలో 37,520 మందికి ప్రవేశాలు కల్పిస్తారు.

ఈపాటికే పూర్తి కావాలి...
సాధారణంగా గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి అడ్మిషన్ల ప్రక్రియ ఈపాటికే పూర్తవుతుంది. గతేడాది ఇప్పటికే ఫలితాలు ప్రకటించి అర్హుల జాబితాను కూడా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. వీరు కాకుండా మిగులు సీట్ల సర్దుబాటు కోసం నెలాఖరు వరకు చర్యలు చేపట్టిన అధికారులు జూన్‌ 1న తరగతులు ప్రారంభించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఫలితాలే ఇవ్వలేదు. ఈ అంశంపై గురుకుల సొసైటీ అధికారులను సంప్రదిస్తున్నప్పటికీ నిర్ణయం తీసుకోలేదనే సమాధానం వస్తోంది. పాఠశాలల పునఃప్రారంభానికి రెండు వారాల సమయం ఉండగా ఇప్పటివరకు ఫలితాల అంశం కొలిక్కి రాకపోవడంతో ఈసారి అడ్మిషన్ల ప్రక్రియ మరింత జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.

దీంతో సెట్‌ రాసిన విద్యార్థుల్లో ఉత్కంఠ తీవ్రమవుతోంది. గురుకుల పాఠశాలల్లో బెస్ట్‌ డైట్‌తోపాటు వసతులు కూడా మెరుగుపడటంతో డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో తీవ్ర పోటీతో సీటు వస్తుందా? రాదా? అని విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. దీంతో ముందస్తు ప్రయత్నాల్లో భాగంగా ఇతర పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గురుకుల ప్రవేశాల సెట్‌ ఫలితాల ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, ఆన్‌లైన్‌లో సీట్ల కేటాయింపు తదితర అంశాలన్నింటికీ సమయం ఎక్కువగా తీసుకుంటుంది. దీంతో నెలాఖరులోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తికావడం కష్టమే. ఒకవేళ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినప్పటికీ మిగులు సీట్ల భర్తీ మాత్రం జూన్‌లోనే చేపట్టే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement