Gurukkal schools
-
‘గురుకులం’.. ప్రవేశాలే అయోమయం!
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలపై అయోమయం నెలకొంది. కేజీ టు పీజీ కార్యక్రమంలో భాగంగా గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అర్హతపరీక్ష నిర్వహించి నెలన్నర కావస్తున్నా ఇంకా ఫలితాలు వెల్లడించకపోవడం గమనార్హం. జూన్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతిలో ప్రవేశంకోసం ఏప్రిల్ ఏడో తేదీన గురుకుల సొసైటీలన్నీ సంయుక్తంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(సెట్) నిర్వహించాయి. వీటిలో వచ్చే మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ల ప్రకారం అడ్మిషన్లు కేటాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 496 గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 232 ఎస్సీ, 87 ఎస్టీ, 142 బీసీ, 35 జనరల్ గురుకులాల పాఠశాలలున్నాయి. ఈ సెట్ ద్వారా ఐదో తరగతిలో 37,520 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ఈపాటికే పూర్తి కావాలి... సాధారణంగా గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి అడ్మిషన్ల ప్రక్రియ ఈపాటికే పూర్తవుతుంది. గతేడాది ఇప్పటికే ఫలితాలు ప్రకటించి అర్హుల జాబితాను కూడా ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. వీరు కాకుండా మిగులు సీట్ల సర్దుబాటు కోసం నెలాఖరు వరకు చర్యలు చేపట్టిన అధికారులు జూన్ 1న తరగతులు ప్రారంభించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఫలితాలే ఇవ్వలేదు. ఈ అంశంపై గురుకుల సొసైటీ అధికారులను సంప్రదిస్తున్నప్పటికీ నిర్ణయం తీసుకోలేదనే సమాధానం వస్తోంది. పాఠశాలల పునఃప్రారంభానికి రెండు వారాల సమయం ఉండగా ఇప్పటివరకు ఫలితాల అంశం కొలిక్కి రాకపోవడంతో ఈసారి అడ్మిషన్ల ప్రక్రియ మరింత జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. దీంతో సెట్ రాసిన విద్యార్థుల్లో ఉత్కంఠ తీవ్రమవుతోంది. గురుకుల పాఠశాలల్లో బెస్ట్ డైట్‌తోపాటు వసతులు కూడా మెరుగుపడటంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో తీవ్ర పోటీతో సీటు వస్తుందా? రాదా? అని విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. దీంతో ముందస్తు ప్రయత్నాల్లో భాగంగా ఇతర పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గురుకుల ప్రవేశాల సెట్ ఫలితాల ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, ఆన్లైన్లో సీట్ల కేటాయింపు తదితర అంశాలన్నింటికీ సమయం ఎక్కువగా తీసుకుంటుంది. దీంతో నెలాఖరులోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తికావడం కష్టమే. ఒకవేళ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినప్పటికీ మిగులు సీట్ల భర్తీ మాత్రం జూన్‌లోనే చేపట్టే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
గురుకులాల్లో నిఘా నేత్రాలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గురుకుల సొసైటీలు చర్యలు చేపట్టాయి. ప్రతి గురుకులంలో అధునాతన పద్ధతిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గురుకులాల సంఖ్య పెరగటంతో అక్కడక్కడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వాటిని నియంత్రించేందుకు నిఘా వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నాయి. ఒక్కో గురుకుల పాఠశాలలో కనిష్టంగా రూ.1.5 లక్షలతో డిజిటల్ సీసీ కెమెరాలు, స్టోరేజీ సిస్టం ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 565 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థను పాఠశాల స్థాయిలో ఆపరేటింగ్ చేసేలా వెసులుబాటు ఉన్నప్పటికీ.. నిర్వహణ తీరును పరిశీలించేందుకు గురుకుల సొసైటీలో ప్రత్యేకంగా కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అన్ని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వీటి ఏర్పాటుకు రూ.15 కోట్లు ఖర్చు చేసేలా సొసైటీలు సుముఖత వ్యక్తం చేయడంతో అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. -
ఫీజుల ‘దడ’ఖాస్తు..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ దరఖాస్తు సగటు నిరుద్యోగికి చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తుకు భారీ మొత్తంలో ఫీజు నిర్ధారించడంతో అభ్యర్థి చేతి చమురు వదులుతోంది. ఎలాంటి ఆదాయ వనరు లేని నిరుద్యోగి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషస్ జారీ చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. దరఖాస్తు ఫీజును రూ.1,200 నిర్ధారించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు రూ.600 చొప్పున ఖరారు చేసింది. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ సగటున ఓ దరఖాస్తుకు రూ.200 ఫీజు నిర్ధారించిందని, అందుకు 6 రెట్లు పెంచడం సరికాదంటున్నారు. పీజీటీ, టీజీటీ కలిపి రూ. 2,400 సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2,932 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో టీజీటీ పోస్టులు 960, పీజీటీ పోస్టులు 1,972 ఉన్నాయి. వీటికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో రూ. 1,200 దరఖాస్తు ఫీజు చూసిన అభ్యర్థులు అవాక్కయ్యారు. పీజీటీ, టీజీటీ అర్హత ఉన్న జనరల్ అభ్యర్థి దరఖాస్తుకు రూ. 2,400 చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. సర్కారు బడ్జెట్ ఇవ్వకపోవడంతో.. గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం టీఆర్‌ఈఐఆర్‌బీ (తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాల ప్రక్రియ జాప్యమవుతుండటంతో త్వరగా భర్తీ చేసేందుకు బోర్డును ఏర్పాటు చేశారు. కానీ బోర్డు నిర్వహణకు సర్కారు నిధులివ్వకుండా.. ఉద్యోగాలకు వచ్చే దరఖాస్తు ఫీజుతోనే పరీక్షల నిర్వహణ, నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేసింది. 12 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్దేశించిన ఫీజు అభ్యర్థులను నిలువునా దోచేయడమే. ఆ ఫీజుతో 12 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు, కోచింగ్‌లంటూ రూ. వేలల్లో ఖర్చు చేస్తున్న నిరుద్యోగుల నుంచి అడ్డగోలుగా వసూలు చేయడం సరికాదు. ఫీజు తగ్గించి.. టీఎస్పీఎస్సీ మాదిరిగా రూ. 200 చొప్పున తీసుకుంటే బాగుంటుంది. – పల్రెడ్డి అనూష, అభ్యర్థి -
మే నాటికి గురుకులాల్లో 8,434 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో వచ్చే మే నాటికి 8,434 పోస్టులను భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శాసనమండలిలో శుక్రవారం గురు కుల పాఠశాలలపై లఘు చర్చ జరిగింది. 10 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం సమాధానమిస్తూ.. ఆయా పోస్టులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 70 ఏళ్లలో 296 గురుకులాలు ఏర్పాటైతే, రాష్ట్రం ఏర్పాటు తర్వాత 577 గురుకులాలు అదనంగా ఏర్పాటయ్యా యని తెలిపారు. ఇది ఒక చరిత్రగా అభివర్ణించారు. రాష్ట్రంలో 240 గురుకుల పాఠశాలలకు నూతన భవనాల కోసం స్థలాలను సేకరించా మని చెప్పారు. 4 క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. అందులో రెండు బాలికలకు, మరో రెండు బాలురకు కేటాయించామన్నారు. స్కూల్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుపై పరిశీలిస్తామని హామీనిచ్చారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్ష ఖర్చు.. పూర్వ కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కడియం చెప్పారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. ఐదు సొసైటీల కింద ఉన్న గురుకులాలను విద్యాశాఖ పరిధిలోకి తేవాలన్న అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ప్రతీ విద్యార్థిపై తమ ప్రభుత్వం ఏడాదికి రూ.లక్ష ఖర్చు చేస్తోందన్నారు. గురుకులాల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. విదేశాల్లో అమలుచేస్తున్న విద్యావిధానాన్ని అధ్యయనం చేయడానికి త్వరలో విదేశాలకు ఒక బృందాన్ని పంపుతామని కడియం తెలిపారు. సమయం కేటాయించడం వరకే చీఫ్ విప్ పని: సతీశ్ గురుకుల పాఠశాలలపై జరిగిన చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యుల మధ్యే వాదోపవాదాలు జరిగాయి. అధికార పార్టీకి చెందిన సభ్యుడు పురాణం సతీశ్ మాట్లాడుతూ.. కొమురం భీం జిల్లాలో సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకొని ‘గురుకులాల్లో సైనిక్ స్కూల్’ అనాలని చెప్పడంతో సతీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభ్యులకు సమయం, అంశం కేటాయించడం వరకే చీఫ్‌విప్ పని. సభ్యుల హక్కులకు పాతూరి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. అంతా ఆయనే మాట్లాడుతారు. జోక్యం చేసుకుంటారు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరో సభ్యుడు రాములు నాయక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ‘దాన వీర శూర కర్ణ’లాంటి వారని, అందుకే బడుగువర్గాలకు గురుకులాలను ఏర్పాటు చేశారని కొనియాడారు. -
ఇక ఇంగ్లిష్ ప్రైమరీ స్కూళ్లు
♦ ఏర్పాటుకు ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నాహాలు ♦ పిల్లల సంఖ్య తగ్గుతున్న ‘సంక్షేమ’ గృహాలు పాఠశాలలుగా మార్పు ♦ 49 స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఎస్సీ అభివృద్ధి శాఖ.. తాజాగా ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో వాటి స్థానంలో కొత్తగా ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో వాటిని నిర్వహించాలని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. తొలుత ప్రయోగ పద్ధతిలో కనిష్టంగా జిల్లాకు ఒకటి చొప్పున, ప్రాధాన్యత క్రమంలో స్కూళ్లు ప్రారంభించేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 49 స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఎస్సీ అభివృద్ధి శాఖ.. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదించింది. ప్రయోగం ఫలిస్తే వచ్చే ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో స్కూళ్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. స్కూళ్ల విషయమై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ఆమోదం లభించనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 40 మందిలోపు విద్యార్థులుంటే.. నలభై కన్నా తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఎంపిక చేసిన అధికారులు.. మౌళిక వసతుల ఆధారంగా ఆంగ్ల మాధ్యమం నాన్ రెసిడెన్షియల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే తొలిదశ నుంచే ఇంగ్లిష్ మీడియంలో చదివిన విద్యార్థులు చురుకుగా ఉన్నట్లు సర్వేల్లో వెల్లడి కావడంతో ప్రాథమిక ఆంగ్ల పాఠశాలల ఏర్పాటుకు ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయంతీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 49 హాస్టళ్లను గుర్తించి స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో టీచర్లను నియమించి బోధన చేపట్టాలని, వాటి నిర్వహణను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వసతి గృహ సిబ్బందిని కొరత ఉన్న హాస్టళ్లకు బదిలీ చేయనుంది. జిల్లా కేంద్రాల్లో ఇంగ్లిష్ మీడియంప్రైమరీ స్కూళ్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, స్కూళ్లలోని 70 శాతం సీట్లను ఎస్సీ విద్యార్థులకే కేటాయించనున్నట్లు ఆ శాఖ సంచాలకులు కరుణాకర్ పేర్కొన్నారు.