
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ దరఖాస్తు సగటు నిరుద్యోగికి చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తుకు భారీ మొత్తంలో ఫీజు నిర్ధారించడంతో అభ్యర్థి చేతి చమురు వదులుతోంది. ఎలాంటి ఆదాయ వనరు లేని నిరుద్యోగి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషస్ జారీ చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. దరఖాస్తు ఫీజును రూ.1,200 నిర్ధారించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు రూ.600 చొప్పున ఖరారు చేసింది. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ సగటున ఓ దరఖాస్తుకు రూ.200 ఫీజు నిర్ధారించిందని, అందుకు 6 రెట్లు పెంచడం సరికాదంటున్నారు.
పీజీటీ, టీజీటీ కలిపి రూ. 2,400
సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2,932 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో టీజీటీ పోస్టులు 960, పీజీటీ పోస్టులు 1,972 ఉన్నాయి. వీటికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో రూ. 1,200 దరఖాస్తు ఫీజు చూసిన అభ్యర్థులు అవాక్కయ్యారు. పీజీటీ, టీజీటీ అర్హత ఉన్న జనరల్ అభ్యర్థి దరఖాస్తుకు రూ. 2,400 చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.
సర్కారు బడ్జెట్ ఇవ్వకపోవడంతో..
గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం టీఆర్‌ఈఐఆర్‌బీ (తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాల ప్రక్రియ జాప్యమవుతుండటంతో త్వరగా భర్తీ చేసేందుకు బోర్డును ఏర్పాటు చేశారు. కానీ బోర్డు నిర్వహణకు సర్కారు నిధులివ్వకుండా.. ఉద్యోగాలకు వచ్చే దరఖాస్తు ఫీజుతోనే పరీక్షల నిర్వహణ, నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేసింది.
12 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్దేశించిన ఫీజు అభ్యర్థులను నిలువునా దోచేయడమే. ఆ ఫీజుతో 12 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు, కోచింగ్‌లంటూ రూ. వేలల్లో ఖర్చు చేస్తున్న నిరుద్యోగుల నుంచి అడ్డగోలుగా వసూలు చేయడం సరికాదు. ఫీజు తగ్గించి.. టీఎస్‌పీఎస్సీ మాదిరిగా రూ. 200 చొప్పున తీసుకుంటే బాగుంటుంది.
– పల్‌రెడ్డి అనూష, అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment