సాక్షి, సిటీబ్యూరో: ‘రెండ్రోజులుగా కంటిమీద కునుకు లేకుండాపోయింది. అమ్మాయి ఎలాఉందో ఏమోననే ఆందోళనతోనే గడిపేస్తున్నాం. మా కూతురు అమెరికాలో మెడికల్ విభాగంలోనే పని చేస్తోంది. తప్పనిసరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తోంది. రోజుకు రెండు మూడుసార్లు ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయినా భయం మాత్రం పోవడం లేదు’కాలిఫోర్నియాలో ఉంటున్న తమ కూతురు పట్ల నగరానికి చెందిన తల్లిదండ్రుల ఆవేదన ఇది. ఆమెకు ఫోన్ చేసిన ప్రతిసారీ తన క్షేమం కంటే హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రుల క్షేమసమాచారం గురించే ఎక్కువగా తెలుసుకుంటోంది. జాగ్రత్తలు చెబుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దంటూ హెచ్చరిస్తోంది. ఇది ఏదో ఒకటి రెండు కుటుంబాలకు చెందిన సమస్య కాదు. విద్య, ఉద్యోగ, వ్యాపార అవరాల కోసం విదేశాల్లోఉంటున్న లక్షలాది మంది పట్ల నగరంలోని వారి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించిన వేళ.. ఏ నోట విన్నా భయాందోళనలే వ్యక్తమవుతున్నాయి.
ఆశల లోగిళ్లలో..
అమెరికా... నిన్నటి వరకు ఒక స్వప్నం. ఉన్నత చదువులు చదివే ప్రతి ఒక్కరూ అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటారు. తల్లిదండులు సైతం తమ పిల్లలు అమెరికాలో ఉంటున్నారని చెప్పుకోవడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించారు. రూ.లక్షల్లో వేతనం, ప్రశాంతమైన జీవితం కోసం అమెరికా వంటి సంపన్న దేశాల వైపే దృష్టి సారిస్తున్నారు. కానీ కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలానికి అగ్రదేశం చిగురుటాకులా వణికిపోతోంది. వేలాది ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. లక్షకుపైగా పాజిటివ్ పంజరంలో చిక్కుకున్నారు. లాక్‌డౌన్‌లు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎన్ని చేసినా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తూనే ఉంది. దీంతో ఆ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న హైదరాబాద్ వాసులు నగరానికి చేరుకొనేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఇక ఆ దేశంలోనే స్థిరపడిపోయిన మనవాళ్లు ఇక్కడ సైతం కరోనా వ్యాప్తిని చూసి ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న తమ పిల్లలు, బంధువుల కోసం ఇక్కడివారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు తల్లడిల్లుతున్నారు. అలాగే వీరి కోసం అక్కడ ఉంటున్న వాళ్లు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందో..
మా అబ్బాయి సిద్ధార్థరెడ్డి పెన్సిల్వేనియా పిట్స్‌బర్గ్‌లో ఉంటున్నాడు. కూతురు సౌందర్య, అల్లుడు శ్రీనివాస్ మిజోరీలో ఉంటున్నారు. అందరూ ఇప్పుడు అక్కడ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. రోజుకు రెండుసార్లు ఫోన్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు. టెన్షన్ తగ్గడం లేదు.– అనూప్‌కుమార్‌రెడ్డి, హబ్సిగూడ
ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాం
మా అబ్బాయి నవీన్ వర్జీనియాలో ఉంటున్నాడు డెలాయిట్లో జాబ్. అక్కడ జూన్ 10 వరకు లాక్‌డౌన్ ఉంటుందట. ఇక్కడిలాగా కాకుండా పరిమితంగా అనుమతిస్తున్నారట. అన్ని పనులు ఆంక్షల నడుమ కొనసాగుతున్నాయి. ప్రతి రోజు అబ్బాయి ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాం.– భానుప్రసాద్, పారిశ్రామిక వేత్త,కాకతీయనగర్
ఉద్యోగాలపై భయం..
మా కూతురు సృజనారెడ్డి, అల్లుడు వివేకాందరెడ్డి కాలిఫోర్నియాలో ఉంటున్నారు. అబ్బాయి సుధీర్‌రెడ్డి వర్జీనియాలో ఉంటున్నాడు. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారట. అన్నీ ఆన్‌లైన్‌లోనే ఇంటికి వచ్చేస్తున్నాయి. వాళ్లకు ఉద్యోగ భద్రత పోతుందేమోనని భయంగా ఉంది. – ప్రతాప్‌రెడ్డి, హబ్సిగూడ
Comments
Please login to add a commentAdd a comment