జిల్లాలపై ఆన్‌లైన్‌లో 83,451 అభ్యంతరాలు
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలకు నిర్దేశించిన గడువు మంగళవారం ముగియనుంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ ద్వారా సోమవారం నాటికి ఆన్‌లైన్‌లో నమోదైన అర్జీల సంఖ్య 83,451కు చేరింది. వీటితోపాటు వివిధ జిల్లాల్లో కలెక్టర్లకు నేరుగా వచ్చిన ఫిర్యాదులు, సలహాలు సూచనలన్నీ కలిపితే ఈ సంఖ్య దాదాపు లక్షకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పది జిల్లాలను కొత్తగా 27 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 22న ముసాయిదాను ప్రకటించింది.
1974 తెలంగాణ డిస్ట్రిక్స్ ఫార్మేషన్ యాక్ట్, 2016 తెలంగాణ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ రూల్స్‌కు అనుగుణంగా మార్పుచేర్పులు చేస్తున్నట్లు అందులో తెలిపింది. కొత్త జిల్లాలతో పాటు కొత్త డివిజన్లు, మండలాలను ప్రతిపాదించింది. వీటిపై అభ్యంతరాలు, సలహాలు సూచనలను అందించేందుకు నిర్దేశించిన 30 రోజుల గడువు ఈ నెల 20తో ముగియనుంది. ఈ విజ్ఞప్తులన్నీ నెలాఖరులోగా పరిశీలించి అవసరమైన మార్పుచేర్పులు చేసిన తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దసరా నుంచి కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాల నుంచి పరిపాలన ప్రారంభించాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఇప్పటికే ఈ ముహూర్తం ఖరారైనందున తుది నోటిఫికేషన్ సైతం అదే రోజున విడుదల చేసే అవకాశాలున్నాయి.
వరంగల్‌పై వీడని సందిగ్ధత
రాష్ట్రంలో ప్రతిపాదించిన 27 కొత్త జిల్లాల్లో 25 జిల్లాలపై ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే వరంగల్ జిల్లాలో వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలుండటంతో పునరాలోచనలో పడింది. దీంతో ఈ రెండు జిల్లాల స్వరూపంపై ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు యాదాద్రి జిల్లా, వనపర్తి జిల్లాలపై ఎక్కువగా అభ్యంతరాలు నమోదయ్యాయి. ప్రతిపాదిత జగిత్యాల జిల్లాలో కోరుట్ల డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఎక్కువగా వెల్లువెత్తాయి.
సవా‘లక్ష’ అభ్యంతరాలు
Published Tue, Sep 20 2016 1:45 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
Advertisement
Advertisement