సభా స్థలి వద్ద చదును చేయిస్తున్న టీఆర్‌ఎస్ నాయకులు
సాక్షి వనపర్తి : ముందస్తు ఎన్నికల్లో భాగంగా అందరి కంటే ముందుగా టీఆర్‌ఎస్ తమ పార్టీ నుంచి బరిలోకి అభ్యర్థులను జాబితా ప్రకటించింది. అదే దూకుడును ప్రచారంలోనూ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కు సంబంధించి వనపర్తిలో తొలి సభ నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 5వ తేదీన జరగనున్న ఈ సభకు స్వయంగా సీఎం కేసీఆర్ హాజరుకానుండడంతో నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణపై దృష్టి సారించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం 40వేలకు తగ్గకుండా ప్రజలను సభకు తరలించాలని కార్యాచరణ రూపొందించారు.
జన ఆశీర్వాద సభ వచ్చే నెల 5వ తేదీన
టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగరవంలో జరిగే జన ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న తొలి భారీ సభ కావడంతో నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్, మక్తల్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, గద్వాల, అలంపూర్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల నుంచి భారీగా ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు.
సభను విజయవంతం చేసే బాధ్యతలను రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కేసీఆర్ అప్పగించారు. అయితే, వనపర్తిలో బహిరంగ సభ ఏర్పాటుచేసినట్లు గత మంగళవారం సాయంత్రం వెల్లడించగానే సభాస్థలి ఎంపికపై నిరంజన్ రెడ్డి తన అనుచరులతో చర్చించి నాగవరంలోని స్థలాన్ని ఎంపిక చేశారు. అప్పటికీ కేవలం ఎనిమిది రోజుల గడువు మాత్రమే ఉండడంతో బుధవారం నాటి నుండే పనులను ప్రారంభించి శరవేగంగా చేపడుతున్నారు. ఈ మేరకు నిరంజన్ రెడ్డి ఎక్కువగా సభ ఏర్పాట్లపైనే దృష్టి సారించి పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు చేస్తున్నాడు.
మండల, గ్రామ కమిటీలకు జన సమీకరణ బాధ్యత
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం నుంచి 40 వేలకు తగ్గకుండా జనాన్ని కేసీఆర్ సభకు సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్ధులు సభను విజయవంతం చేసే పనిలోనే నిమగ్నమయ్యారు. జనాన్ని సమకరించేందుకు అన్ని మండల, గ్రామ కమిటీలకు బాధ్యతలను అప్పగించారు. భారీగా జనాన్ని తరలించి సభను విజయవంతం చేయడం ద్వారా ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసరాలని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నారు.
అటు ప్రచారం.. ఇటు సభ
ఈనెల 6వ తేదీన ప్రభుత్వాన్ని రద్దు చేసి అదే రోజు 105 మందితో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. తొలి విడతలో ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించారు. దీంతో ఆయా అభ్యర్థులు ఇన్ని రోజుల పాటు ప్రచారంలో మునిగిపోయారు. అయితే, వారం రోజుల్లో ముఖ్యమంత్రి సభ ఉండడంతో ఎక్కువ సమయం జన సమీకరణ, ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు.
పక్కాగా ఏర్పాట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న సభ కావడంతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో పాటు జనం పెద్దసంఖ్యలో రానున్నారని భావిస్తున్నారు. అయితే, ఎంత మంది వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలు, పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నాగవరంలోని ఎంపిక చేసిన స్థలంలో చదును చేసే పనులు పూర్తి కావొచ్చాయి. ఒకటి, రెండు రోజుల్లో వేదిక నిర్మాణం, ఇతరత్రా పనులను ప్రారంభించనున్నారు.
సభాస్థలాన్ని పరిశీలించిన నిరంజన్‌రెడ్డి
వనపర్తి క్రైం: కేసీఆర్ పాల్గొననున్న సభ నిర్వహణ కోసం వనపర్తి మండలం నాగవరం శివారులో స్థలాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలపై నాయకులతో ఆరా తీశారు. భారీగా హాజరయ్యే పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌన్సిలర్లు వాకిటి శ్రీధర్, గట్టు యాదవ్, మాజీ జెడ్పీటీసీ వెంకట్రావు, సుధాకర్, రవి, విష్ణుసాగర్, కురుమూర్తినాయుడు, మురళీసాగర్, చిన్నారెడ్డి ఉన్నారు.
ఆరుచోట్ల పార్కింగ్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అటు పార్టీ శ్రేణులు, ఇటు ప్రజలు సీఎం కేసీఆర్ సభకు తరలివచ్చే అవకాశం ఉండడంతో వాహనాల పార్కింగ్‌కు ఆరు స్థలాలు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి 44పై నుంచి ముఖ్యంగా మహబూబ్‌నగర్, మక్తల్, జడ్చర్ల, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను అనూస్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేయించాలని నిర్ణయించారు. కొల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలు వనపర్తిలోని హైస్కూల్, పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో, గద్వాల, అలంపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు కొత్త కలెక్టరేట్, అక్షర స్కూల్ వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, వనపర్తిలోని గోపాల్‌పేట, రేవల్లి మండలాల నుంచి వచ్చే వాహనాల కోసం అయ్యప్ప గుడి నుంచి భగీరధ ఫంక్షన్ హాల్ వైపు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment