ఖైరతాబాద్ చౌరస్తాలో ఆక్టోపస్ కమాండోల స్పెషల్ ఆపరేషన్ దృశ్యాలు..
బంజారాహిల్స్ : సోమవారం ఉదయం 10 గంటలు.. ఖైరతాబాద్ సిగ్నల్.. ఒక్కసారిగా అక్కడివచ్చిన ఓ భారీ వాహనంలోంచి కొందరు వ్యక్తులు దిగారు.. క్షణాల్లోనే చుట్టుపక్కల భవనాలను ఎక్కేశారు. ఏం జరుగుతోందో తెలియక జనమంతా ఉత్కంఠకు గురయ్యారు. కంగారు పడ్డారు. వాహనంలోంచి దిగినవారి చేతుల్లో అత్యాధునిక తుపాకులున్నాయి. ప్రత్యేక దుస్తులు ధరించి ఉన్న వారంతా ఆక్టోపస్ కమాండోలు. హైదరాబాద్ సేఫ్ అండ్ సెక్యూర్ సిటీ అని చెప్పే క్రమంలో భాగంగా ఆక్టోపస్ కమాండోలు ఖైరతాబాద్ చౌరస్తాలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. నిమిషాల వ్యవధిలోనే చౌరస్తాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని వారి గుప్పిట్లోకి తీసుకున్నారు. చౌరస్తాకు నలువైపులా గస్తీ కాస్తూ అనుమానితులను విచారించారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదంతా ఎందుకంటే.. హైదరాబాద్ దేశంలోకెల్లా అత్యంత రక్షణాత్మక నగరమని చాటిచెప్పేందుకే వీరు చేసిన ప్రయత్నం. నగరంలో ఎక్కడ ఎటువంటి విపత్తులు జరిగినా క్షణాల్లోనే కమాండోలు అందుబాటులో ఉంటారని ఆక్టోపస్ సీనియర్ అధికారి వివరించారు. అంతే కాకుండా సామాన్యులకు కూడా తమ టీమ్ గురించి అవగాహన కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆక్టోపస్ కమాండోలతో నగరం మరింత రక్షణాత్మకంగా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment