ప్రభుత్వాస్పత్రుల్లో అన్నిరకాల వైద్య సేవలు: టి.రాజయ్య
సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వైద్యసేవలు అందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. తెలంగాణ పీపుల్స్ సైన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జన విజ్ఞాన వేదిక తొలి రాష్ట్రస్థాయి మహాసభల్లో ఆయన మాట్లాడారు.
కొందరు ప్రభుత్వ వైద్యులు రోగులతో సరిగా మాట్లాడకుండానే మందులను రాస్తుం టారని, అందుకనే ప్రజలు నాటు వైద్యులను ఆశ్రయిస్తుంటారని అన్నారు. మురికివాడలు, తండాలు, ఏజెన్సీల్లో ఉండే ప్రజలు రాత్రివేళల్లో దోమలు, పగటిపూట ఈగలతో ఇబ్బందులు పడుతుంటారని పేర్కొన్నారు. వీటి కారణంగానే విషజ్వరాల బారిన పడుతున్నారన్నారు. పరిసరాల పరిశుభ్రత, నివారణచర్యలపై ప్రజ ల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలను చేపడుతున్నామని, వీటిల్లో పారామెడికల్, అంగన్‌వాడీ, వార్డు మెంబర్లు, సర్పంచులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. ఎలాంటి రోగం వచ్చి నా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్సలు చేయించాలని ప్రజలను కోరారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం అనే అంశాలపై సదస్సును నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటివి ప్రతిచోటా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.సత్యప్రసాద్, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.