T. Rajaiah
-
టీఆర్ఎస్లోనే కొనసాగుతా: టి.రాజయ్య
హైదరాబాద్ : తాను టీఆర్ఎస్ను వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, చివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగుతానని, సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు జరుగుతున్నదంతా అసత్య ప్రచారమే అన్నారు. టీఆర్ఎస్ను విడిచి పెట్టడం లేదు, బంగారు తెలంగాణలో భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. తనను కావాలనే కొందరు వివాదాల్లోకి లాగుతున్నారని, ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర’ అని డాక్టర్ రాజయ్య వివరించారు. -
డిప్యూటీ-మాజీ డిప్యూటీ మధ్య రగడ
స్టేషన్లో చిచ్చు డిప్యూటీ-మాజీ డిప్యూటీ మధ్య రగడ సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో ఆధిపత్య పోరు అధికారులకుసంకటంగా మారిన పరిస్థితి లింగాలఘణపురం : స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లు తమ వెంట ఉండే ద్వితీయ శ్రేణి నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించే విషయంలో వివాదాలు ఉండేవి. తాజాగా ప్రభుత్వ పథకాలు, పరిపాలన అంశాల్లో కూడా పోరు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి మార్పు తర్వాత తన నియోజకవర్గంలో ఎవరు వేలు పెట్టినా సహించేదిలేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య పదేపదే ప్రకటిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే ఇటీవల సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ లబ్ధిదారుల విషయంలో ఇదే జరిగింది. వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను సన్న, చిన్నకారు రైతులకు అందిస్తోంది. ఇటీవల జిల్లాకు 94 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. వ్యవసాయశాఖలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్, మహబూబాబాద్, మరిపెడ, నర్సంపేట, ములుగు, పరకాల, ఏటూరునాగారం డివిజన్లు ఉన్నాయి. గ్రామీణ మండలాలకు సగటున రెండు చొప్పున కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ట్రాక్టరుపై గరిష్టంగా రూ.5 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. నిబంధనల ప్రకారం.. ఆయా గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి సర్పంచ్, ఎంపీటీసీ.. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తహశీల్దార్, ఎంపీడీవో, ఏవోల ఆమోదంతో సబ్సిడీ పరికరాల పంపిణీ ప్రాధాన్యత కల్పించాలి. మరో ఉదాహరణ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని మండలాలకు రెండు చొప్పున ట్రాక్టర్లు కేటాయించారు. తనకు దగ్గరగా ఉండే ఒక రైతుకు సబ్సిడీ ట్రాక్టర్ పంపిణీ అయ్యేలా చూడాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సిఫారసు లేఖ ఇచ్చారు. పథకానికి సంబంధించి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నట్లుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీడీవోలతోనూ సంతకాలు చేసి ఆమోదం తెలిపారు. ఇక రేపోమాపో ట్రాక్టర్ వచ్చేస్తుందనే ధీమాతో దరఖాస్తు చేసుకున్న రైతు ఓ ట్రాక్టర్ కంపెనీ యజమానిని వెంటబెట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. విషయం తెలిసిన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య ఆగ్రహం ఆ దరఖాస్తును వెనక్కి తీసుకరావాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మధ్య అధికార యంత్రాంగం బిక్కుబిక్కుమంటున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. సబ్సిడీ ట్రాక్టర్లకు సంబంధించి మార్చి 30లోగా లబ్ధిదారుల ఎంపిక చేసి పంపిణీ పూర్తి చేయాలి. ప్రజాప్రతినిధుల సిఫారసులతో తాము ఏం చేసే పరిస్థితి లేదని వ్యవసాయశాఖ అధికారులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోని రైతులకు కనీసం సమాచారం లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేల పైరవీకారులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించిన జాండీర్, సుబోటో, న్యూహోలాండ్, ఎస్కర్ట్ కంపెనీల షోరూం యజమానులకు మాత్రమే ఈ పథకంపై సమాచారం ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఈ సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ కేటాయింపులో సిఫారసులు చేస్తుండడంతో అర్హులైన ఎందరో రైతులకు ప్రభుత్వ పథకాల గురించి సమాచారం తెలియడం లేదు. దీంతో ప్రభుత్వ పథకాల ఉద్దేశం నెరవేరడం లేదు. -
'మానవత్వం లేని మనిషి కేసీఆర్'
హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి టి.రాజయ్య వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీటీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్శింహులు శుక్రవారం నిప్పులు చెరిగారు. కేసీఆర్ మానవత్వం లేని మనిషి అని ఆయన ఆరోపించారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి దుర్మార్గంగా తొలగించారని విమర్శించారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి అవమాన పరిచే విధంగా తొలగించారని ఆరోపించారు. రాజయ్యకు వెంటనే క్షమాపణలు చెప్పాలని మోత్కుపల్లి నర్సింహులు... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. -
కలకలం
మాజీ డిప్యూటీ సీఎంకు ఛాతినొప్పి ఆస్పత్రిలో చేరిన రాజయ్య జిల్లా వ్యాప్తంగా చర్చ టీవీలకు అతుక్కుపోయిన జనం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వరంగల్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రంగా మారిన ఉప ముఖ్యమంత్రి మార్పు పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా రాజకీయ పరిణామాలతో ఒత్తిడికి గురైన రాజయ్య చాతినొప్పికి గురయ్యూరు. అధిక రక్తపోటుతో రాజయ్య హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. రాష్ట్రంలో అకస్మాత్తుగా జరిగిన ఉప ముఖ్యమంత్రి మార్పు అంశంతోనే ఆస్పత్రిలో చేరారని తెలిపాయి. తెలంగాణ మొదటి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టి.రాజయ్య ఈ నెల 25న మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురయ్యారు. దీర్ఘకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరికి ఈ పదవి వచ్చింది. తన బర్తరఫ్‌నే ఊహించని టి.రాజయ్య... ఉప ముఖ్యమంత్రి పదవిలో కొత్తగా చేపట్టిన నియామకం ఇబ్బందికరంగా మారింది. ఉప ముఖ్యమంత్రి మార్పు విషయంలో టి.రాజయ్య స్పందించి అదేరోజు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నిర్ణయం విషయంలో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. ఇంటితో విషయం సద్దుమణిగిందని టీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. రెండు రోజులుగా టి.రాజయ్య దగ్గరికి పలువురు సన్నిహితులు వెళ్తున్నారు. జరిగిన విషయంపై ఆరా తీస్తూ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో టి.రాజయ్య ఒత్తిడికి గురయ్యారని.. ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. కాగా, టి.రాజయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజయ్య భర్తరఫ్ కావడం, శ్రీహరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టడం వేగంగా జరిగారుు. ఈ పరిణామాలతో టీఆర్ఎస్ శ్రేణులు, నాయకుల్లో అయోమయం నెలకొంది. కొత్త నిర్ణయంపై కొద్దికొద్దిగా కుదురుకుంటున్న తరుణంలోనే రాజయ్య ఆస్పత్రిలో చేరడం గులాబీ పార్టీలో ఆందోళన పెరిగింది. -
రాజయ్యకు ఉద్వాసన?
* డిప్యూటీ సీఎం పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి * వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతిపై సీఎంకు ‘ఇంటెలిజెన్స్’ నివేదిక? * తాజాగా ‘స్వైన్‌ఫ్లూ’ వ్యవహారంతో వేటు వేయడానికే నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల పాలన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంచలనం చోటు చేసుకోనుందా? వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం టి.రాజయ్యపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా!? ఆయనకు ఉద్వాసన పలకాలని సీఎం భావిస్తున్నారా?.. ఈ ప్రశ్నలన్నింటికీ టీఆర్ఎస్ అత్యున్నత వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. రాజయ్య పనితీరు, వైద్యారోగ్య శాఖలో అవినీతి వ్యవహారాలతో పాటు తాజాగా ‘స్వైన్‌ఫ్లూ’ వ్యవహారం వంటివన్నీ డిప్యూటీ సీఎం రాజయ్య మెడకు చుట్టుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికిప్పుడు కాకున్నా, త్వరలోనే ఆయనకు ‘కత్తెర’ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. తీవ్రంగా పరిగణించిన సీఎం..: రాష్ట్రంలో ఏ ఇతర శాఖలపై రాని అవినీతి ఆరోపణలు, ప్రతికూల వార్తలు వైద్య, ఆరోగ్య శాఖపై రావడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ శాఖలో జరిగినట్లుగా చెబుతున్న రూ. 15 కోట్ల అవినీతిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. వైద్య, ఆరోగ్య శాఖలో ఒక అధికారి పోస్టింగ్ కోసం ఏకంగా రూ. 40 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. 108 సర్వీసులకు వాహనాల కొనుగోలుకు సంబంధించి ఒక్కో వాహనానికి రూ. 50 వేల వరకూ పర్సంటేజీ మాట్లాడుకున్నారన్న ఫిర్యాదులు కూడా సీఎంకు అందినట్లు తెలుస్తోంది. సీఎం అసంతృప్తిని చూపుతున్న పలు ఉదంతాలనూ కొందరు ఉదహరిస్తున్నారు. వైద్య, పారామెడికల్ ఉద్యోగాల భర్తీలో అవకతవకల ఆరోపణలు వార్తలు వచ్చినరోజున డిప్యూటీ సీఎం రాజయ్య తన కార్యాలయంలో ఏజెన్సీల ఎంపిక పారదర్శకంగా ఉందని ప్రకటిస్తున్న సమయంలోనే.. సీఎం కే సీఆర్ ఆ శాఖ ఉన్నతాధికారులను పిలిపించుకుని ‘క్లాస్’ తీసుకున్నారు. అప్పటికప్పుడు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేశారు కూడా. ఇక ‘స్వైన్‌ఫ్లూ’ విషయంలోనూ రాజయ్య సరిగా స్పందించలేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించడంలో విఫలమయ్యారన్న అభిప్రాయంతో సీఎం ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే బుధవారం స్వైన్‌ఫ్లూ అంశంపై సీఎం నిర్వహించిన సమీక్ష సమాచారం కూడా డిప్యూటీ సీఎంకు లేదని తెలుస్తోంది. ఇక మరోవైపు మంచిర్యాల పర్యటనలో ఆసుపత్రి సిబ్బంది వసూళ్ల గురించి రోగుల బంధువులు ఫిర్యాదు చేస్తే... ‘వందా, రెండు వందలు తీసుకుంటే తప్పేంట’ని రాజయ్య మాట్లాడాన్ని కూడా కేసీఆర్ తీవ్రంగా పరిగణించారని అంటున్నారు. విభజన చట్టం ద్వారా అందివచ్చిన ఎయిమ్స్ ఏర్పాటు కోసం స్థల సేకరణ అంశాన్నీ సీరియస్‌గా తీసుకోలేదని, బీబీనగర్ నిమ్స్‌ను ప్రారంభించడానికి చొరవ తీసుకోలేదన్న అసంతృప్తీ రాజయ్యపై ఉందని చెబుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం రాజయ్య పేషీలోని ఓఎస్డీల పనితీరుపైనా ఫిర్యాదులు ఉన్నాయి. వారే అన్నీ తామై అనధికారికంగా సమీక్షలు జరుపుతున్న విషయం సీఎం దృష్టికి వెళ్ళింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీకి తొలి రిజిష్ట్రార్‌గా నియమించిన అధికారిపై గతంలోనే ఫిర్యాదులు ఉన్నా, ఎంపిక చేయడాన్ని సీఎం తప్పు పట్టారని... మరో జీవో ద్వారా నియమకాన్ని నిలిపివేశారని అంటున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే రాజయ్యకు ఉద్వాసన పలకాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బహిరంగంగా సీఎం ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. చివరకు బుధవారం కేబినెట్ భేటీ తర్వాత విలేకరుల సమావేశంలో రాజయ్యను వెనకేసుకొచ్చే తీరులోనే కేసీఆర్ మాట్లాడారు. కానీ పార్టీ వర్గాల్లో మాత్రం మరో రకమైన ప్రచారమే జరుగుతోంది. అంతేగాకుండా నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేకు కేబినెట్లో చోటు కల్పించాల్సిన అత్యవసర పరిస్థితి పార్టీకి ఉందని, ఈ లెక్కన ఒకరిని తగ్గించడం ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
డిప్యూటీ సీఎం వాహనం ఢీకొట్టిన మహిళ మృతి
డిప్యూటీ సీఎం ఎస్కార్ట్ వాహనం ఢీ కొన్న ఘటనలో గాయాలు వరంగల్: ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో గాయపడిన గులాం సాదికున్నీసా బేగం (48) శుక్రవారం వేకువజామున మృతి చెందింది. మృతురాలి భర్త కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నిడమనూర్‌కు చెందిన గులాం గౌసు, సాదికున్నీసాబేగం దంపతులు నవంబర్ 30న వరంగల్ నుంచి నల్లగొండకు బయల్దేరారు. ఈ క్రమంలో జనగామ మండలం యశ్వంతాపూర్ దగ్గర డిప్యూటీ సీఎం రాజయ్య ఎస్కార్ట్ వాహనం టైరు పగిలి ఆ దంపతులు ప్రయూణిస్తున్న కారును ఢీకొంది. దీంతో సాదికున్నీసా బేగంకు తీవ్రగాయాలు కాగా, హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఈ నెల 24న డిశ్చార్జ్ అరుు్యంది. వారు వరంగల్‌లోని ఎఫ్‌సీఐ కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. కాగా, శుక్రవారం వేకువ జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. రోడ్డుప్రమాదంతో పక్కటెముకల్లో రక్తం గడ్డకట్టడంతోపాటు ఊపిరితిత్తుల్లోకి రక్తం వెళ్లడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని గౌస్ వెల్లడించారు. మృతురాలి కుమార్తె షహాజదీమోహ్‌వీన్(7) తల్లి మృతదేహాన్ని చూసి నిద్రపోరుుందా అని అడగడం చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యూరు. -
70% నిధులు పరికరాల కొనుగోలుకే!
ఆసుపత్రుల అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు: ఉప ముఖ్యమంత్రి రాజయ్య మిగతా నిధులు ఆధునీకరణకు.. నెల రోజుల్లోగా పనులు ప్రారంభం 300 మంది డాక్టర్లు, 250 నర్సుల పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి పనులకు 15 రోజుల్లోగా టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య వెల్లడించారు. నిధుల్లో 70 శాతాన్ని అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకే కేటాయిస్తామని, మిగతా మొత్తాన్ని ఆసుపత్రుల రూపురేఖలు మార్చడానికి వినియోగిస్తామని ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల పరిధిలోని ఉన్నతాధికారులతో రాజయ్య బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రులకు కేటాయించిన నిధుల ఖర్చుకు ప్రణాళికలు, అంచనాలు సిద్ధమయ్యాయని చెప్పారు. 15 రోజుల్లో టెండర్లు పిలిచి, మరో 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తిచేసి జనవరి చివరి నాటికి లేదా ఫిబ్రవరి మొదటి వారంలోగా ఆసుపత్రుల పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 600 కోట్లు విడుదలయ్యాయని ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. ఆ నిధులతో ఔట్ సోర్సింగ్ పద్ధతిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా మొత్తం 930 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. పలు జిల్లాల్లో ఉన్న 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్కోటి 90 లక్షల రూపా యల వ్యయంతో కొత్త భవనాలను నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే గూడురు, ఊట్నూరు, నాగార్జునసాగర్, ఎల్లారెడ్డి, సదాశివపేటల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలను 40.80 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా శాశ్వత ప్రాతిపదికన 300 మంది వైద్యులు, 250 నర్సుల పోస్టులను భర్తీ చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల బకాయిలు ఎక్కడా లేవని, దీనిపై ఏవైనా సమస్యలుంటే త్వరలో ఒక సమావేశం ఏరా్పాటు చేసి పరిష్కరిస్తామని తెలిపారు. 108పై త్వరలో నిర్ణయం 108 అంబులెన్సులను జీవీకే నిర్వహిస్తుందా? లేక ప్రభుత్వ ఆధ్వర్యంలోనా? అనేదానిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఉప ముఖ్యమంత్రి రాజయ్య చెప్పారు. 108, 104కు సంబంధించి 600 కొత్త వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం 15 రోజుల్లో టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ విభజనపై ఆలోచిస్తున్నామని, ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు వేర్వేరు బడ్జెట్లు కేటాయించారని గుర్తుచేశారు. ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రులకే ఔట్ పేషెంట్లుగా వెళ్లాలన్న అంశంపై స్పందిస్తూ... ఉద్యోగులకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయిస్తున్నట్లు రాజయ్య చెప్పారు. అలాగే ప్రత్యేకంగా మందులు, క్యాంటిన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు త్వరలోనే ఆరోగ్య కార్డులు అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. -
అధికారికంగా పీవీ వర్ధంతి సభ
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 10వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో మంగళవారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమానికి పీవీ కుటుంబసభ్యులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రులు టి. రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, పి.మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి తదితరులు హాజరై నివాళులు అర్పించారు. పీవీ కుమారుడు, మాజీ ఎంపీ పీవీ రాజేశ్వర్‌రావు, కుమార్తెలు శ్రీవాణి, జయ నందన, మనవళ్లు, మనవరాళ్లను పలుకరించిన ముఖ్యమంత్రి అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. పీవీ మనవడు నవీన ఏర్పాటు చేసిన ఉచిత నేత్రవైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కాగా, పీవీ వర్ధంతి కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు దూరంగా ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ అధికార ప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మినహా పార్టీ నేతలెవరూ ఈ కార్యక్రమానికి రాకపోవడం గమనార్హం. ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీవీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కాగా, టీడీపీ నాయకులెవ్వరూ పీవీ సమాధిని సందర్శించలేదు. -
ప్రభుత్వ చేతుల్లోకి 108!
యోచిస్తున్నామన్న మంత్రి రాజయ్య సాక్షి, హైదరాబాద్: అవసరమైతే 108 అంబులెన్స్ సర్వీసును తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య గురువారం అసెంబ్లీలో తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతామన్నారు. వీటి నిర్వహణపై జీవీకే సంస్థ సరిగా వ్యవహరించడం లేదన్న జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు. జీవీకే తీరు సరిగా లేకపోవడంతో ఆ సంస్థను ప్రభుత్వం ఇటీవల తీవ్రంగా మందలించిందని చెప్పారు. ఇక, 2018 నాటికి రాష్ర్టంలో మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పలు పద్దులకు సభ ఆమోదం గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం పలు శాఖల పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్, రవాణా, ఐటీ, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయం, హోం, విద్య, వైద్య ఆరోగ్యం, నీటిపారుదల, రెవెన్యూ శాఖల పద్దులపై అన్ని పక్షాల సభ్యులు మాట్లాడారు. బకాయిలున్న గ్రామ పంచాయతీల్లో విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా చూస్తామని, రాష్ర్ట విభజన సమయంలో చెల్లించని ఉపాధి హామీ వేతనాల బకాయిల సొమ్ము రూ. 94 కోట్లను విడుదల చేస్తామని మంత్రులు చెప్పారు. అధికారాలను గ్రామ పంచాయతీలకు దఖలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. త్వరలో కొత్త పంచాయతీ చట్టాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. కాగా, సాయంత్రం నుంచి టీడీపీ సభ్యులెవరూ సభలో లేకపోవడం గమనార్హం. సభ అర్ధరాత్రి 12.40 దాకా సాగింది. -
'అంతర్జాతీయ ప్రమాణాలతో రహదార్ల నిర్మాణం'
హైదరాబాద్: రాష్ట్రంలో రహదార్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని తెలంగాణ డిప్యూటీ సీఎం టి.రాజయ్య స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణంపై డిప్యూటీ సీఎం రాజయ్య అధ్యక్షతను మంత్రి వర్గ ఉప సంఘం శనివారం హైదరాబాద్‌లో భేటీ అయింది. అనంతరం రాజయ్య మాట్లాడుతూ... వీలైనంత త్వరగా ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అధికారులు కోరామని తెలిపారు. ఈ అంశంపై మళ్లీ 7 వ తేదీ సాయంత్రం మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అవుతుందని చెప్పారు. ఎలాంటి మెటీరియల్ వాడితే రహదారులు ఎక్కువ కాలం మన్నుతాయో అధ్యయం చేసి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేస్తామని టి.రాజయ్య వెల్లడించారు. -
జూడాలు బేషరతుగా విధుల్లో చేరాలి: మంత్రి రాజయ్య
జూడాలు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సిందే విపక్షాలు విషజ్వరాలను డెంగ్యూ జ్వరంగా చిత్రిస్తున్నాయి సాక్షి,హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు బేషరతుగా విధుల్లో చేరాల్సిందేనని, వారిని చర్చలకు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని డిప్యూటీ సీఎం, వెద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య స్పష్టంచేశారు. చట్టానికి అనుగుణంగా, గతంలో వారు ఒప్పుకున్న విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు విధులు నిర్వహించాల్సిందేనన్నారు. అలా జరగని పక్షంలో చట్టప్రకారం చర్యలుంటాయన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం వారు నడుచుకోవాల్సిందేనని, వారు ఇంకా జూనియర్ డాక్టర్లే అన్న విషయాన్ని గు ర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వపరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో విపక్షాలు విషజ్వరాలను డెంగ్యూ వ్యాధిగా చిత్రిస్తున్నాయని రాజయ్య విమర్శించారు. డెంగ్యూ నిర్ధారణ కోసం ప్రభుత్వ బ్లడ్‌బ్యాంక్‌లలో రూ.7.50 కోట్ల ఖర్చుతో ప్లేట్లెట్ సెపరేషన్ మిషన్లను అందుబాటులో తెస్తామన్నారు. విషజ్వరాల వల్ల బాధ ఉంటుందే తప్ప మరణాలు ఉండవని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏజెన్సీ ఏరియాలో విషజ్వరాల నివారణకు నిరంతరం వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. విషజ్వరాల మాట అటుంచి పాము, కుక్క కాటుకు మం దులు లేవంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమని రాజయ్య అన్నారు. సమ్మెకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మద్దతు తెలంగాణ సీఎం రోజుకు ఒక వేషం వేస్తున్నారని, జూడాల సమస్యలపై కేసీఆర్ నిర్మాణాత్మకంగా ఆలోచించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో జూడాల సమస్యలపై అఖిల పక్ష, మేధావుల సమావేశం జరిగింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీజీడీఏ, ఐఎంఏలు జూడాలకు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణయ్య మాట్లాడుతూ జూడాల సమస్యలు న్యాయమైనవని, కేసీఆర్ ప్రభుత్వం వారి సమస్యలపై బుర్రపెట్టి ఆలోచించాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవగాహన లేని మంత్రులు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. సంవత్సరం పాటు జూడాలు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలన్న నిబంధనలో కుట్ర దాగుందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ జూడాలను చ ర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రతి పక్షం లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. ఏ రకంగా జూడాలు రూరల్ సర్వీసులు చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లురవి, బీజేపీ లీగల్‌సెల్ నేత రామచందర్‌రావు, ఐఎంఏ నేషనల్ లీడర్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ అప్పారావు, టీజీడీఏ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వీరేశం, తెలంగాణ గెజిటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపల్లి రాజేందర్, జూడాల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోఠి ఉస్మానియా వైద్య కళాశాలలో జూడాల రీలే నిరాహార దీక్ష కొనసాగింది. -
ఉద్యోగులకు దీపావళి ధమాకా
హెల్త్‌కార్డులపై డిప్యూటీ సీఎం రాజయ్య వ్యాఖ్య కార్డుల పంపిణీ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కార్డు ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందించిన దీపావళి ధమాకా అని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య అన్నారు. బుధవారం సచివాలయం డి బ్లాక్ కాన్ఫరెన్స హాలులో ఉద్యోగులకు ఆయన హెల్త్‌కార్డులను అందజేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు తొలికార్డును అందించారు. టీజీఓ, టీఎన్జీవో నాయకులు కె.రవీందర్‌రెడ్డి, వి.మమత, విఠల్, బండారు రేచల్, కె.లక్ష్మణ్, కాసం విజయలక్ష్మితో సహా మొత్తం 59 మందికి ఈ కార్డులను ఇచ్చారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ అడగకుండానే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు వరాలు ప్రకటించారన్నారు. హెల్త్‌కార్డులను సీఎం సోమవారమే లాంఛనంగా ప్రారంభించారని, వాటిని తాను పంపిణీ చేస్తున్నానని చెప్పారు. నవంబర్ 1నుంచి ఈ కార్డులు అమల్లోకి వస్తాయని, ఏ ఆస్పత్రిలోనైనా, ఏ వ్యాధికైనా దీనిద్వారా చికిత్స పొందవచ్చని తెలిపారు. ఎయిడెడ్ స్కూళ్లు, ఎక్సైజ్, పోలీసు శాఖల ఉద్యోగులకు దీనిని వర్తింపజేసే విషయంపై ముఖ్యమంత్రి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు. తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని మరోసారి రుజువు చేసుకున్నామన్నారు. సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు పాటుపడాలని, బంగారు తెలంగాణను సాధించే దిశలో కృషిచేయాలన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ర్టంలో 5 ఏళ్ల వ్యవధిలో 42,43 సమావేశాలు జరిగినా హెల్త్‌కార్డులపై స్పష్టత రాలేదన్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం స్వల్ప వ్యవధిలోనే కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను క్షేమంగా చూసుకోవడం తమ బాధ్యత అని చెప్పిన సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. సీఎం సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు, పథకాలు ప్రజలకు చేరాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యోగులు కృషిచేయాలన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వంలో పూర్తి భాగస్వామ్యంతో ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రూ.వంద కోట్ల చొప్పున కేటాయించి, నిమ్స్‌స్థాయికి తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగుల వైద్య చికిత్స కోసం రెండు లక్షల లిమిట్ ఎందుకని, రూ.10 అయినా లేదా రూ.20 లక్షలు అయినా ఇచ్చేందుకు సీఎం ముం దుకు వచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ధనుంజయరెడ్డి మాట్లాడుతూ మొత్తం 1,885 జబ్బులకు, ఉద్యోగులు కోరుకున్న ఏ ఆసుపత్రిలోనైనా హెల్త్‌కార్డుతో సేవలు అందుతాయని చెప్పారు. కుటుంబ కార్డు మాదిరిగా కాకుండా ఎవరికి వారికి వ్యక్తిగతంగా కార్డులుంటాయన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి ఉద్యోగికి లాగిన్ ఐడిని ఇస్తామని, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామన్నారు. తదనుగుణంగా తమ కార్డులను డౌన్లోడ్ చేసుకుని లామినేట్ చేసుకుంటే హెల్త్‌కార్డు వచ్చేసినట్లేన ని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఇంకా ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ పూలరవీందర్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని ఉద్యోగులు ఊరేగించి, క్షీరాభిషేకం చేశారు. హెల్త్‌కార్డుల జారీలో, విలువైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కార్యాలయం వైపు వస్తున్న ఈ ఊరేగింపును పోలీసులు అడ్డుకోవడంతో స్పల్పంగా తోపులాట జరిగింది. అనంతరం మీడియా పాయింట్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కేసీఆర్ ఫ్లెక్సీని ఉంచి పాలతో అభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ నాయకులు ఈ.నాగరాజు, జాకబ్, నర్సింగరావు, ఇంకా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, పలువురు ఎన్టీఓ, టీఎన్జీవో నాయకులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యోగులకు ప్రయోజనం దక్కేలా ఆరోగ్య కార్డులు ఇచ్చి సీఎం కేసీఆర్ తన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఇదేరీతిలో ఉద్యోగులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రతిశాఖ ఉద్యోగులు 'మనశాఖ- మన ప్రణాళిక' పెట్టుకుని ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. ఆరోగ్య కార్డుల విషయంలో మాట నిలబెట్టుకున్నందుకు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘం నాయకుడు దేవిప్రసాద్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. -
'లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నాం'
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబుతో కేసీఆర్ చర్చకు రావాలన్న నారా లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. భరోసాయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతల అవినీతి బయటపెడితే జైలుభరో యాత్ర చేయాల్సివుంటుందన్నారు. కాంగ్రెస్ నేతల అవినీతి రుజువైతే తెలంగాణలో ఉన్న జైళ్లు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. గతంలో విద్యుత్ మంత్రిగా షబ్బీర్ అలీ ఏం చేశారని ప్రశ్నించారు. కాగా, దొంగే దొంగ అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య ధ్వజమెత్తారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. వ్యవసాయం దండగన్నారని, బషీర్‌బాగ్ లో కాల్పులు జరిపించారని గుర్తు చేశారు. -
'టీఆర్ఎస్ ... దొరల పార్టీ'
మెదక్: టీఆర్ఎస్ దొరల పార్టీ, కుటుంబ పార్టీ అని ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అభివర్ణించారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం వచ్చిన ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్యను కేసీఆర్ అవమానించారని ఆరోపించారు. అందుకు నిరసనగా రేపటి నుంచి 10 రోజులపాటు నిరసనలు చేపడుతున్నట్లు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. -
గెలుపు ఖాయం... మెజారిటీయే లక్ష్యం
సదాశివపేట: మెదక్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నేతల దిమ్మదిరిగేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య తెలిపారు. బుధవారం పట్టణంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జరి గిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు నల్లేరుపై నడకేనని, అధిక మెజారిటీయే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర పాలనలో బానిస బతుకులే దిక్కు అయ్యాయని, ఇక బంగారు తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు అనుకూలంగా ఏనాడూ మాట్లాడలేదన్నారు. గతంలో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా మంజూరు చేయలేదన్నారు. అకాల వర్షాలు, వడగళ్లకు నష్టపోయిన తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ రూ. 480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేశారని వివరించారు. అదే విధంగా 40 లక్షల మంది రైతులకు రూ. 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయబోతున్న ఘనత కూడా కేసీఆర్‌దేనని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని దాదాపు 80 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాజయ్య పేర్కొన్నారు. దళిత, గిరిజన, మైనార్టీ బీసీ ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రుపాయల నిధులను కేటాయించడానికి నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, గువ్వల బాల్‌రాజ్, సంజీవరావు, మాజీ ఎమ్మెల్యేలు హరిశ్వర్‌రెడ్డి, రత్నం, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ కోడూరి రవీందర్ యాదవ్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ అభివృద్ధిపై ఎందుకు దృష్టి పెట్టరు?
హైదరాబాద్: ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌పై కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఆరోపించారు. ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ఎందుకు దృష్టి సారించడంలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతల పర్యవేక్షణకు అధికారాలను గవర్నర్ కు అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధిలేదని విమర్శించారు. మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయంమని చెప్పారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో అన్నిరకాల వైద్య సేవలు: టి.రాజయ్య
సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వైద్యసేవలు అందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. తెలంగాణ పీపుల్స్ సైన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జన విజ్ఞాన వేదిక తొలి రాష్ట్రస్థాయి మహాసభల్లో ఆయన మాట్లాడారు. కొందరు ప్రభుత్వ వైద్యులు రోగులతో సరిగా మాట్లాడకుండానే మందులను రాస్తుం టారని, అందుకనే ప్రజలు నాటు వైద్యులను ఆశ్రయిస్తుంటారని అన్నారు. మురికివాడలు, తండాలు, ఏజెన్సీల్లో ఉండే ప్రజలు రాత్రివేళల్లో దోమలు, పగటిపూట ఈగలతో ఇబ్బందులు పడుతుంటారని పేర్కొన్నారు. వీటి కారణంగానే విషజ్వరాల బారిన పడుతున్నారన్నారు. పరిసరాల పరిశుభ్రత, నివారణచర్యలపై ప్రజ ల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలను చేపడుతున్నామని, వీటిల్లో పారామెడికల్, అంగన్వాడీ, వార్డు మెంబర్లు, సర్పంచులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. ఎలాంటి రోగం వచ్చి నా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్సలు చేయించాలని ప్రజలను కోరారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం అనే అంశాలపై సదస్సును నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటివి ప్రతిచోటా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.సత్యప్రసాద్, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. -
వైద్యమందకపోతే ఒక్క ఫోన్ కొట్టండి: రాజయ్య
గజ్వేల్: ‘‘ప్రభుత్వ వైద్యం ప్రజలందరికీ అందుబాటులోకి రావాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.. ఈ ఆశయానికి వైద్యులు, సిబ్బంది తూట్లు పొడిస్తే సహించేదిలేదు. వైద్య సేవలు అందించడంలో ఎవరైనా అలసత్వాన్ని ప్రదర్శిస్తే నా సెల్ నంబర్ 9849790363కు కాల్చేయండి. ఆ తర్వాత కథ నేను చూసుకుంటా’’ అని డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య ప్రజలకు సూచించారు. మంగళవారం గజ్వేల్‌కు వచ్చిన ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. వివిధ వార్డులను పరిశీలించి వైద్య సేవలందుతున్న తీరు గురించి రోగులనే అడిగి తెలుసుకున్నారు. -
వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ
- ప్రభుత్వం వద్ద ప్రతిపాదన - మంత్రి రాజయ్య వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హెల్త్ యూనివర్సిటీని వరంగల్‌లో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య చెప్పారు. కొత్తగా రూపుదిద్దుకుంటున్న బీబీనగర్ నిమ్స్‌లో ఉన్న విధంగానే వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలోనూ హెల్త్ యూనివర్సిటీకి కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఉన్నట్లు తెలిపారు. అయితే, ఈ విషయంలో ముఖ్యవుంత్రి కేసీఆర్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం తొలిసారిగా ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌ను సందర్శించారు. ఎమర్జెన్సీ, ట్రామా కేర్, సూపర్‌స్పెషాలిటీ, మిలీనియం, ఓపీ బ్లాక్‌ల్లోకి వెళ్లి, వైద్య సేవలు అందుతున్న తీరును ఆయున ఆరా తీశారు. అనంతరం డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిమ్స్‌లో శిథిలావస్థకు చేరుకున్న ఫిజియోథెరపీ యూనిట్‌ను ఆధునీకరించి, రోగులకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. మరో రెండు మాసాల్లో బీబీనగర్‌లో ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తావున్నారు. -
పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు
* వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్య * సచివాలయంలో బాధ్యతల స్వీకరణ * సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి తనిఖీలు * వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పిల్లల వార్డులో పడకల సంఖ్య పెంపుపై తొలి సంతకం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైద్యరంగాన్ని ప్రక్షాళన చేసి, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి. రాజయ్య అన్నారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన నేరుగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని హెల్త్, మెడికల్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.అంతకుముందు వార్డుల్లో తనిఖీలు నిర్వహించి, వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆస్పత్రిలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న నర్సులు, 4వ తరగతి ఉద్యోగులను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగంలోని పడకల సంఖ్యను 50 నుంచి 120కి పెంచే ఫైలుపై మొదటి సంత కం చేశారు. అందుకు రూ. 24 కోట్లు కేటాయించారు. అలాగే మెదక్ జిల్లా నంగునూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు 50 పడకలు మంజూరు చేస్తూ రెండో ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా విధి నిర్వహణలో పారదర్శకంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. గడప గడపకూ వైద్యం అందించడం.. సర్కారీ మందులను పేదలకు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. రాజయ్య బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వరంగల్ జిల్లానుంచి అనేకమంది అభినందనలు తెలిపేందుకు తరలిరాగా ‘డి’బ్లాకు కిక్కిరిసిపోయింది. ఆయన్ను మంత్రులు టి.హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తదితరులు అభినందించారు.