అధికారికంగా పీవీ వర్ధంతి సభ
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 10వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో మంగళవారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమానికి పీవీ కుటుంబసభ్యులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రులు టి. రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, పి.మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి తదితరులు హాజరై నివాళులు అర్పించారు. పీవీ కుమారుడు, మాజీ ఎంపీ పీవీ రాజేశ్వర్‌రావు, కుమార్తెలు శ్రీవాణి, జయ నందన, మనవళ్లు, మనవరాళ్లను పలుకరించిన ముఖ్యమంత్రి అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
పీవీ మనవడు నవీన ఏర్పాటు చేసిన ఉచిత నేత్రవైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కాగా, పీవీ వర్ధంతి కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు దూరంగా ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ అధికార ప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మినహా పార్టీ నేతలెవరూ ఈ కార్యక్రమానికి రాకపోవడం గమనార్హం. ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీవీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కాగా, టీడీపీ నాయకులెవ్వరూ పీవీ సమాధిని సందర్శించలేదు.