ఉద్యోగులకు దీపావళి ధమాకా | Diwali damaka to Health card employees, says Rajaiah | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు దీపావళి ధమాకా

Published Thu, Oct 23 2014 4:24 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

ఉద్యోగులకు దీపావళి ధమాకా - Sakshi

ఉద్యోగులకు దీపావళి ధమాకా

హెల్త్‌కార్డులపై డిప్యూటీ సీఎం రాజయ్య వ్యాఖ్య  
కార్డుల పంపిణీ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

 
 సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కార్డు ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందించిన దీపావళి ధమాకా అని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య అన్నారు. బుధవారం సచివాలయం డి బ్లాక్ కాన్ఫరెన్‌‌స హాలులో ఉద్యోగులకు ఆయన హెల్త్‌కార్డులను అందజేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు తొలికార్డును అందించారు. టీజీఓ, టీఎన్జీవో నాయకులు కె.రవీందర్‌రెడ్డి, వి.మమత, విఠల్, బండారు రేచల్, కె.లక్ష్మణ్, కాసం విజయలక్ష్మితో సహా మొత్తం 59 మందికి ఈ కార్డులను ఇచ్చారు.
 
 ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ అడగకుండానే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు వరాలు ప్రకటించారన్నారు. హెల్త్‌కార్డులను సీఎం సోమవారమే లాంఛనంగా ప్రారంభించారని, వాటిని తాను పంపిణీ చేస్తున్నానని చెప్పారు. నవంబర్ 1నుంచి ఈ కార్డులు అమల్లోకి వస్తాయని, ఏ ఆస్పత్రిలోనైనా, ఏ వ్యాధికైనా దీనిద్వారా చికిత్స పొందవచ్చని తెలిపారు. ఎయిడెడ్ స్కూళ్లు, ఎక్సైజ్, పోలీసు శాఖల ఉద్యోగులకు దీనిని వర్తింపజేసే విషయంపై ముఖ్యమంత్రి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు. తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని మరోసారి రుజువు చేసుకున్నామన్నారు. సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు పాటుపడాలని, బంగారు తెలంగాణను సాధించే దిశలో కృషిచేయాలన్నారు.
 
 టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ర్టంలో 5 ఏళ్ల వ్యవధిలో 42,43 సమావేశాలు జరిగినా హెల్త్‌కార్డులపై స్పష్టత రాలేదన్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం స్వల్ప వ్యవధిలోనే కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను క్షేమంగా చూసుకోవడం తమ బాధ్యత అని చెప్పిన సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. సీఎం సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు, పథకాలు ప్రజలకు చేరాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యోగులు కృషిచేయాలన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వంలో పూర్తి భాగస్వామ్యంతో ఉద్యోగులు పనిచేయాలని సూచించారు.
 
  హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రూ.వంద కోట్ల చొప్పున కేటాయించి, నిమ్స్‌స్థాయికి తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగుల వైద్య చికిత్స కోసం రెండు లక్షల లిమిట్ ఎందుకని, రూ.10 అయినా లేదా రూ.20 లక్షలు అయినా ఇచ్చేందుకు సీఎం ముం దుకు వచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ధనుంజయరెడ్డి మాట్లాడుతూ మొత్తం 1,885 జబ్బులకు, ఉద్యోగులు కోరుకున్న ఏ ఆసుపత్రిలోనైనా హెల్త్‌కార్డుతో సేవలు అందుతాయని చెప్పారు. కుటుంబ కార్డు మాదిరిగా కాకుండా ఎవరికి వారికి వ్యక్తిగతంగా కార్డులుంటాయన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి ఉద్యోగికి లాగిన్ ఐడిని ఇస్తామని, ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తామన్నారు. తదనుగుణంగా తమ కార్డులను డౌన్‌లోడ్ చేసుకుని లామినేట్ చేసుకుంటే హెల్త్‌కార్డు వచ్చేసినట్లేన ని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఇంకా ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ పూలరవీందర్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
 కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
 బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని ఉద్యోగులు ఊరేగించి, క్షీరాభిషేకం చేశారు. హెల్త్‌కార్డుల జారీలో, విలువైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కార్యాలయం వైపు వస్తున్న ఈ ఊరేగింపును పోలీసులు అడ్డుకోవడంతో స్పల్పంగా తోపులాట జరిగింది. అనంతరం మీడియా పాయింట్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కేసీఆర్ ఫ్లెక్సీని ఉంచి పాలతో అభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ సచివాలయ  ఉద్యోగుల సమన్వయ కమిటీ నాయకులు ఈ.నాగరాజు, జాకబ్, నర్సింగరావు, ఇంకా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, పలువురు ఎన్టీఓ, టీఎన్జీవో నాయకులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement