పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు
* వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్య
* సచివాలయంలో బాధ్యతల స్వీకరణ
* సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి తనిఖీలు
* వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పిల్లల వార్డులో పడకల సంఖ్య పెంపుపై తొలి సంతకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైద్యరంగాన్ని ప్రక్షాళన చేసి, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి. రాజయ్య అన్నారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన నేరుగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని హెల్త్, మెడికల్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.అంతకుముందు వార్డుల్లో తనిఖీలు నిర్వహించి, వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆస్పత్రిలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న నర్సులు, 4వ తరగతి ఉద్యోగులను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగంలోని పడకల సంఖ్యను 50 నుంచి 120కి పెంచే ఫైలుపై మొదటి సంత కం చేశారు. అందుకు రూ. 24 కోట్లు కేటాయించారు. అలాగే మెదక్ జిల్లా నంగునూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు 50 పడకలు మంజూరు చేస్తూ రెండో ఫైలుపై సంతకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా విధి నిర్వహణలో పారదర్శకంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. గడప గడపకూ వైద్యం అందించడం.. సర్కారీ మందులను పేదలకు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. రాజయ్య బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వరంగల్ జిల్లానుంచి అనేకమంది అభినందనలు తెలిపేందుకు తరలిరాగా ‘డి’బ్లాకు కిక్కిరిసిపోయింది. ఆయన్ను మంత్రులు టి.హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తదితరులు అభినందించారు.