
టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా: టి.రాజయ్య
హైదరాబాద్ : తాను టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, చివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగుతానని, సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు జరుగుతున్నదంతా అసత్య ప్రచారమే అన్నారు. టీఆర్‌ఎస్‌ను విడిచి పెట్టడం లేదు, బంగారు తెలంగాణలో భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. తనను కావాలనే కొందరు వివాదాల్లోకి లాగుతున్నారని, ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర’ అని డాక్టర్ రాజయ్య వివరించారు.