ప్రజల పక్షం వహించాలి
ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడుపొంగులేటి శ్రీనివాసరెడ్డిపాండురంగాపురం రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషిఎయిర్‌పోర్ట్ నిర్వాసితులకు న్యాయం చేయాలి
కొత్తగూడెం : ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల పక్షం వహించి.. వారికి న్యాయం చేయాలని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక రైల్వేగ్రౌండ్‌లో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కొత్తగూడెం ప్రజల చిరకాల వాంఛ అయిన క్రమబద్ధీకరణను సాకారం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 373 జీఓ జారీ చేశారని, దానిని పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. నెలరోజుల్లో క్రమబద్ధీకరణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, లేదంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఎన్నికల వరకే పార్టీలు ఉండాలని, తరువాత ప్రజల కోసమే పనిచేయాలని సూచించారు. కొత్తగూడెంలో పేదల స్థలాల్లో అధికారులు బోర్డులు పెడుతున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ సీపీ ముందుంటుందన్నారు.
అభివృద్ధికి వైఎస్సార్ సీపీ విరుద్ధం కాదని, దీనివల్ల నష్టపోయే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని సౌకర్యాలు కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తానన్నారు. పాండురంగాపురం గ్రామంలో రైల్వేస్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. తొలుత ముర్రేడు బ్రిడ్జి వద్ద ఎంపీ పొంగులేటికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా రైల్వేగ్రౌండ్‌కు చేరుకున్నారు.
సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి ముత్తయ్య, ప్రచార కార్యదర్శి పులి రాబర్ట్ రామస్వామి, అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వైరా నియోజకవర్గ ఇన్‌చార్జి బొర్రా రాజశేఖర్, చండ్రుగొండ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, సారేపల్లి శేఖర్, పాల్వంచ పట్టణాధ్యక్షుడు తుమ్మల శివారెడ్డి, కొత్తగూడెం మండలాధ్యక్షుడు కందుల సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు కంభంపాటి దుర్గాప్రసాద్, భీమా శ్రీవల్లి, తాండ్ర శ్రీనివాస్, దుంపల అనురాధ, దుంపల సరోజ, బాలిశెట్టి సత్యభామ, నీల, ఎంపీటీసీలు తాటి పద్మ, బొల్లం శ్రీనివాస్, కసనబోయిన శైలజ, నాయకులు జక్కుల సత్యనారాయణ, చిలక రాములు తదితరులు పాల్గొన్నారు.