సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష మరికొన్ని గంటల్లో నెరవేరబోతోంది. ఆరవై ఏళ్ల పోరాట ఫలం అతి త్వరలో అందబోతోంది. జూన్ రెండో తేదీని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అన్నివర్గాలు ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో పెద్దఎత్తున వేడుకలు నిర్వహిస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం కూడా అధికారికంగా ఆవిర్భావ వేడుకలు చేపడుతోంది. ప్రభుత్వ యంత్రాంగం జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి ఏకంగా వారం రోజులపాటు ఆవిర్భావ వేడుకలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రెండో తేదీ ఉదయం గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక తయారుచేశారు. అదేవిధంగా జూన్ ఐదో తేదీన కలెక్టరేట్‌లో జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, కవులు, కళాకారులకు సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8న వికారాబాద్‌లో ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం
Published Fri, May 30 2014 10:41 PM | Last Updated on Sat, Aug 11 2018 7:51 PM
Advertisement