యువతకు చట్టబద్ధమైన వీసాలు
దుబాయ్‌లో టామ్‌కామ్ రోడ్ షోలో హోం మంత్రి నాయిని
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వచ్చే తెలంగాణ యువతకు చట్టబద్ధమైన కంపెనీ వీసాలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం దుబాయ్‌లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్) నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి నాయినితోపాటు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. రాష్ట్ర యువతకు ఉపాధి కోసం విదేశాల్లోని కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. కొందరు దళారీలను నమ్మి మోసపోతున్నారని, విజిట్ వీసా, ఆజాద్ వీసా, ఫ్రీ వీసా, ప్రైవేట్ వీసాలపై వస్తూ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్నారు. ఇక నుంచి ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటుందని చెప్పారు. ఇందుకు టామ్‌కామ్ ఇక్కడి కంపెనీలతో చర్చలు జరుపుతుందన్నారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికుల కోసం ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టిందని వివరించారు.