
రేషన్ కోసం..
♦ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్బంధం
♦ రంగంపేటలో లబ్ధిదారుల రాస్తారోకో
కొల్చారం: రేషన్ బియ్యం ఇవ్వడంలేదని అధికారులను, ప్రజాప్రతినిధులను బంధించి నిరసన తెలిపిన ఘటన జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. రెక్కాడితేకాని డొక్కాడని శ్రమ జీవుల రేషన్.. నాలుగు నెలల నుంచి‘కీ రిజిష్టర్’లో తొలగిస్తూ వస్తున్నారు. రూపాయికి కిలో బియ్యంతో పొట్టనింపుకుందామన్న వారి పరిస్థితి గట్టెక్కించేవారే కరువయ్యారు. దీంతో రేషన్ లబ్ధిదారుల్లో ఆవేశం కట్టలుతెగింది. శనివారం సాదా బైనామాల విషయంపై గ్రామసభకు వచ్చిన అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను గ్రామ పంచాయతీలో బంధించిన లబ్ధిదారులు రాస్తారోకోకు దిగారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన 1వ నెంబర్ రేషన్ దుకాణానికి నాలుగు నెలల నుంచి 240 మంది పేర్లు కీ రిజిష్టర్‌లో తొలగిస్తు వస్తున్నాయి.
దీంతో దాదాపు 20 క్వింటాళ్ళ బియ్యం తక్కువ రావడంతో పేర్లు తొలగించిన వారికి రేషన్‌బియ్యం ఇవ్వడం లేదు. ఈ విషయమై లబ్ధిదారులు నాలుగు నెలలుగా వీఆర్‌ఓకు, రేషన్ డీలర్లకు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది దృష్టికి తీసుకె ళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ క్రమంలో సాదాబైనామాలపై అవగాహన సదస్సుకు స్థానిక వీఆర్‌ఓ చంద్రయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ వచ్చారు. దీంతో లబ్ధిదారులు గ్రామ పంచాయతీ వద్దకు పెద్దఎత్తున తరలివచ్చారు. తమకు బియ్యం ఇస్తారా.. లేదా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఓ మహిళ తాడుతో ఉరివేసుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్న వారు అడ్డుకున్నారు.
కోపోద్రికులైన ప్రజలు వీఆర్‌ఓ, డిప్యూటీ తహసీల్దార్‌లతోపాటు అక్కడే ఉన్న రాష్ట్ర టెస్కో డెరైక్టర్ అరిగె రమేష్‌కుమార్‌ను గ్రామ పంచాయతీలో బంధించి తాళం వేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి రహదారిపై రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న కొల్చారం ఏఎస్‌ఐ రాజు తన సిబ్బందితో గ్రామానికి చేరుకొని బంధించిన వారిని విడిపించారు.రాస్తారోకోకు దిగిన వారి వద్దకు చేరుకొని డిప్యూటీ తహసీల్దార్ ఫోన్ ద్వారా ఆర్డీవోతో మాట్లాడించారు. బుధవారంలోగా అందరి పేర్లు రేషన్ కీ రిజిష్టర్‌లో వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు.