కోరుట్ల: ‘దుబాయ్.. ముంబయి ‘..జగిత్యాల ప్రాంత వాసులు ఎక్కువ మంది ఈ రెండు ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన వారు ఉన్నారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్టు గల్ప్ దేశాలతో పాటు మహారాష్ట్రలోని ముంబయిలోనూ ఎక్కువగా ఉండటంతో ఆయా ప్రాంతాల నుంచి ఈ పదిహేను రోజుల వ్యవధిలో సుమారు 4వేల మంది వరకు స్వస్థలాలకు తిరిగివచ్చినట్లు సమాచారం. వీరందరికి ఎయిర్‌పోర్టుల్లో పరీక్షలు జరిపినా 14 రోజుల వరకు గృహ నిర్భంధంలో ఉండాల్సిన అవసరముండటంతో వైద్యాధికారులు వారిని గుర్తించి నిర్భంధంలో ఉంచుతున్నారు.
గృహ నిర్బంధంలో 2,690 మంది..
స్థానికంగా సరైన ఉపాధి అవకాశాలు లేక కొంత మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లగా.. 1970 దశకంలో ముంబయిలోని సెంచురీ మిల్‌లో పనిచేసేందుకు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల నుంచి చాలా మంది వలసవెళ్లారు. ముంబాయి వలస వెళ్లిన కుటుంబాలు అక్కడే పనులు చేసుకుంటూ స్థిర నివాసాలు ఏర్పరుకున్నప్పటికీ స్థానికంగా ఉన్న సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాలతో పాటు ముంబాయిలోనూ కరోనా ఎఫెక్టు ఎక్కువగా ఉండటం.. పాఠశాలలకు సెలవులు ఉండటంతో ఆయా ప్రాంతాల నుంచి చాలా మంది తిరిగి స్వస్థలాలకు చేరకుంటున్నారు. ఈ రీతిలో సుమారు 4 వేల మందివరకు ఈ మధ్యకాలంలో జిల్లాకు చేరుకున్నట్లు అంచనా. వీరిలో దాదాపు 2,690 మందిని గుర్తించిన వైద్యాధికారులు వారిని స్వీయ గృహ నిర్భంధంలో ఉండాలని ఆదేశించారు.
పక్కా జాగ్రత్తలు..
స్వీయ గృహ నిర్భంధంలో 14 రోజుల పాటు ఉండాల్సిన దుబాయ్, ముంబయి వాసులను గుర్తించిన వైద్యాధికారులు వారి చేయిపై గుర్తులు వేసి ఉంచుతున్నారు. కొంత మంది స్వీయ నిర్భంధానికి ససేమిరా అనడంతో పోలీసుల సహకారంతో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి నిర్బంధంలో ఉంచుతున్నారు. వీరి కుటుంబ సభ్యులతో వీరు దూరంగా ఉండేలా పక్కా చర్యలు తీసుకుంటున్నారు. కొంత మంది కుటుంబ సభ్యులను ఇతర ప్రాంతాల్లో ఉండాలని చెప్పి తరలిస్తున్నారు. ప్రతీ రోజు వైద్య సిబ్బంది వారి వద్దకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నామని జిల్లా వైధ్యాధికారి శ్రీధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment