- లబ్దిదారుల ఎంపికలో జాప్యం
- 23 మండలాల నుంచే లబ్దిదారుల జాబితాలు
- అధికార పార్టీ నేతల సిఫారసులతో ఆలస్యం
- అధికారుల నిర్లక్ష్యంతో మరింత జాప్యం
కరీంనగర్ (ముకరంపుర) :
పొగ పొయ్యితో ఆడపడుచులు అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో నిరుపేద కుటుంబాలకు దీపం పథకం ద్వారా ఉచి తంగా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించాలన్న సర్కారు లక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. గ్యాస్ కనెక్షన్లు మంజూరై, మండలాల వారీగా లక్ష్యా లు కేటాయించి మూడు నెలలవుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ గ్యాస్ అందకపోవడం గమనార్హం. మార్చిలో నియోజకవర్గానికి 5 వేల చొప్పున జిల్లాలోని 13 నియోజకవర్గాలకు 65 వేల కనెక్షన్లను ప్రభుత్వం మంజూరీ చేసింది. దరఖాస్తులు స్వీకరించి మూడు నెలలు గడిచినా అర్హులైన వారి తుదిజాబితాను ఇంతవరకు ఖరారు చేయలేదు. తుది జాబితాను ఆమోదించి గ్యాస్ ఏజెన్సీలకు పంపిన అనంతరం జిల్లా మంత్రి సై అనే వరకు లబ్దిదారులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీపం కనెక్షన్లు మంజూరు చేసేందుకు ప్రత్యేక కమిటీ లబ్దిదారులను ఎంపిక చేస్తుంది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మండల స్థాయిలో ఎంపిక బాధ్యతను ఎంపీడీవోలకు కట్టబెట్టారు. గ్రామ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్న నిబంధనలకు స్వస్తి పలికారు. స్థానిక అధికార పార్టీ నాయకుల సిఫారసులు, సర్పంచ్ నివేదించిన జాబితాల మేరకు ఎంపీడీవోలు లబ్దిదారుల తుదిజాబితా రూపకల్పనలో జాప్యం చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా యంత్రాంగానికి 23 మండలాలకు సంబంధించిన తుదిజాబితా మాత్రమే చేరింది. గ్రామాల నుంచి వచ్చిన జాబితాను ఆధార్ ప్రామాణికంగా డేటా ఎంట్రీ పూర్తి చేసి జిల్లా పౌరసఫరాల శాఖ కార్యాలయానికి పంపించాల్సి ఉంది. మిగిలిన మండలాల్లో తుదిజాబితా రూపకల్పన మొదలు పెట్టకపోగా, గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన జాబితా కూడా చేరలేదని తెలుస్తోంది.
జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 12,35,838 కుటుంబాలున్నాయి. అందులో 7,80,499 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 4,55,339 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేవని తేలింది. ప్రభుత్వం మంజూరు చేసిన 65 వేల కనెక్షన్లకు జిల్లాలో 1.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మహిళా సంఘాలకు ప్రాధాన్యమిస్తూ 25 శాతం ఎస్సీలు, 16 శాతం ఎస్టీలు, మైనారిటీలకు గ్యాస్ కనెక్షన్ అందించాలని నిర్ణయిం చారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము ఒక్కో కనెక్షన్‌కు రూ.1600 చొప్పున మొత్తం 65వేల కనెక్షన్లకు రూ.10.40 కోట్లు అందజేసింది. ఏప్రిల్ 17 నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నిర్ణీత గడువు దాటినా దీపం కనెక్షన్ల పంపిణీ కొలిక్కి రాలేదు. దీపం పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌లు జారీ చేసి ఖాళీ సిలిండర్, రెగ్యులేటర్ అందజేస్తారు. లబ్దిదారులు కనెక్షన్ డాక్యుమెంట్, పాస్‌బుక్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ. మైనారిటీలు గతంలో ప్రభుత్వం నుంచి దీపం పథకం ద్వారా లబ్దిపొందనివారు, గ్యాస్ కనెక్షన్ తీసుకునేందుకు డబ్బు వెచ్చించలేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులు. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితా ఎంపీడీలకు చేరుతుంది. అక్కడ ఖరారు చేసిన తుదిజాబితా జిల్లా పౌరసరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీలకు చేరాల్సి ఉంటుంది. అరుుతే కమిటీ చైర్మన్ ఉన్న కలెక్టర్ నుంచి లబ్దిదారుల జాబితాకు జిల్లా మంత్రికి నివేదించి, ఆయన ఆమోదించిన తర్వాతనే కనెక్షన్లు అందించే అవకాశముంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మేల్కోవాల్సి ఉంది.
మంజూరైన కనెక్షన్లు-65,000
ఒక్కో నియోజకవర్గానికి-5,000
వచ్చిన దరఖాస్తులు-1,54,000