
కోల్‌కతా: దేశంలో దేవీ నవరాత్రుల వైభవం కొనసాగుతోంది. ఈ నవరాత్రులలో ఏడవ రోజున కాళికాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గాదేవి రూపం మహిళా సాధికారతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాళికా రూపాన్ని పూజించడం ద్వారా శత్రుబాధ నివారణ అవుతుందని, దుఃఖాలు నశించిపోతాయని చెబుతుంటారు.
దేశంలో పలు కాళీమాత ఆలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆసక్తికర చరిత్రలు ఉన్నాయి. వీటిలో ఐదు దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిబడి(ఆగ్రా)
ఆగ్రాలోని కాలిబడి కాళికా ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఉన్న అద్భుత ఘాట్‌లోని నీరు ఎప్పటికీ ఎండిపోదని, అందులో క్రిమికీటకాలు పెరగవని స్థానికులు చెబుతుంటారు.
జై మా శ్యామసుందరి(కోల్‌కతా)
మరో కాళీ దేవాలయం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉంది. దాని పేరు జై మా శ్యామసుందరి కాళీ మందిరం. ఈ ఆలయంలో కాళీదేవి సంచరిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ప్రతీరోజూ ఉదయం ఆలయ తలుపు తెరిచినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయని అంటారు.
కాళీఘాట్(పశ్చిమ బెంగాల్)
మూడవ కాళీ దేవాలయం కూడా పశ్చిమ బెంగాల్‌లో ఉంది. కాళీఘాట్‌లోని ఈ కాళీ దేవాలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో కాళీదేవి నాలుక బంగారంతో తయారు చేశారు.
కాళీ ఖో(ఉత్తరప్రదేశ్)
నాల్గవ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో వింధ్య పర్వతంపై కాళీ ఖో పేరిట ఉంది. ఈ ఆలయం ధ్యాన సాధనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారికి సమర్పించే ప్రసాదం మాయమవుతుండటం వెనక కారణం ఏమిటో నేటికీ వెల్లడి కాలేదని భక్తులు చెబుతుంటారు.
మాతా బసయ్య(మొరెనా)
ఐదవది ఉత్తరప్రదేశ్‌లోని మొరెనాలో ఉన్న మాతా బసయ్య ఆలయం. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం నాటిది. నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ద్వారా భక్తుల తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
ఇది కూడా చదవండి: కైలాస్‌నాథ్... చరణాద్రి శిఖరం