నిర్మాణంలో ఉన్న నగరంలోని శాంతినగర్ జూనియర్ కళాశాల
ఖమ్మం సహకారనగర్: నిధులు విడుదలైనా నత్తనడకన నిర్మాణాలు. అనుకున్న సమయానికి పూర్తికాని భవనాల పనులు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పనులు జరగని పరిస్థితి. జూనియర్ కళాశాలల భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. కొత్త భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని శాంతినగర్, చింతకాని మండలం నాగులవంచ, నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కొత్త భవన నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఒక్కో భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేశారు. ఇందులో ప్రధానంగా శాంతినగర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవతో అదనంగా సుమారు రూ.కోటిన్నర నిధులు కేటాయించి.. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. తొలి రోజుల్లో పనులు వేగవంతం చేసి నిర్మాణాలు సగానికి పైగా పూర్తి చేశారు. ఆ తర్వాత అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలున్నాయి.
సుమారు రెండేళ్లు..
రెండేళ్లుగా కళాశాల భవనం నిర్మాణంలో ఉండగా.. ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సుమారు 600 మంది ఇబ్బంది పడుతున్నారు. భవన నిర్మాణం తొలి రోజుల్లో శాంతినగర్ పాఠశాలలో షిఫ్టులవారీగా తరగతులు నిర్వహించి.. ఆరు నెలలపాటు అవస్థలు పడ్డారు. తర్వాత పాఠశాల భవనం అరకొర పనుల్లో ఉండగానే విద్యార్థులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో నిర్మాణ సమయంలో పలు గ్రూపుల విద్యార్థులకు నిర్మాణ గదుల్లోనే తరగతులు బోధించిన సంఘటనలున్నాయి. అలాగే నేలకొండపల్లి, నాగులవంచ జూనియర్ కళాశాల విద్యార్థులు సైతం భవన నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసినట్లయితే విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే ఆవకాశం ఉంది. శాంతినగర్ కళాశాల భవన నిర్మాణానికి యథావిధిగా రూ.కోటి కేటాయిస్తే.. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తాను చదువుకున్న కళాశాల కావడంతో ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూడాలని, తన మార్క్‌ను చూపించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అదనంగా సుమారు రూ.1.50కోట్లు తీసుకొచ్చారు. ఆ వెంటనే పనులు ముమ్మరం చేయగా.. తర్వాత మధ్యలోనే పనులు మందగించాయి.
నత్తనడకన నిర్మాణాలు..
మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించిన భవన నిర్మాణాలన్నీ నత్తనడకన సాగు తుండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడా ల్సి వస్తోంది. అరకొర వసతులతోనే విద్యాబోధన సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగం వీటి నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొన్ని పెండింగ్‌లోనే..
కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. భవన నిర్మాణం ప్రారంభానికి ముందు జీఎస్టీ లేకపోవడం, తర్వాత జీఎస్టీ అమలు తదితర సమస్యలతో నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. భవనం పూర్తయితే విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునే అవకాశం ఉంది. – విజయ, శాంతినగర్ కళాశాల ప్రిన్సిపాల్, ఖమ్మం
పురోగతిలో పనులు..
మూడు కళాశాలలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త భవనాల్లో తరగతులు ప్రారంభమయ్యే ఆవకాశం ఉందని భావిస్తున్నాం. – రవిబాబు, డీఐఈఓ, ఖమ్మం
బ్లాక్ లిస్టులో పెట్టాలి..
కళాశాలల భవన నిర్మాణాల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను తక్షణమే బ్లాక్ లిస్టులో పెట్టాలి. నిర్మాణాలు పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలి. – తాళ్ల నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment