ఆఫ్‌లైన్‌లో పోకర్ గేమ్ | Offline Poker Game | Sakshi
Sakshi News home page

ఆఫ్‌లైన్‌లో పోకర్ గేమ్

Published Wed, Jul 30 2014 4:12 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ఆఫ్‌లైన్‌లో పోకర్ గేమ్ - Sakshi

ఆఫ్‌లైన్‌లో పోకర్ గేమ్

పంజగుట్ట: ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆడే పోకర్ గేమ్ (మూడు ముక్కలాట)ను నిబంధనలకు విరుద్ధంగా ఆఫ్‌లైన్‌లో ఆడుతున్న 15 మంది జూదరులను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేసి, పంజగుట్ట పోలీసులకు అప్పగించారు.  పంజగుట్ట ఏసీపీ వెంటేశ్వర్లు కథనం ప్రకారం... బేగంబజార్‌కు చెందిన కిషోర్‌కుమార్‌కు సోమాజిగూడ పార్క్ హోటల్‌లో మెంబర్‌షిప్ ఉంది. ఇతను సోమవారం సాయంత్రం పార్క్ హోటల్‌లోని 5వ అంత స్తులో ఒక రూమ్ తీసుకున్నాడు.

నగరంలో వివిధ ప్రాంతాల్లో వ్యాపారం చేసుకొనే ఇతని స్నేహితులు 14 మందిని తీసుకొచ్చాడు. వీరిలో 8 మంది సొంత అన్నదమ్ములే. గదిలోకి వెళ్లిన వెంటనే డోర్ వేసుకున్నారు. ఆన్‌లైన్‌లో పోకర్ బంగా, వెస్‌బుక్‌లో పోకార్ జింగా వెబ్‌సైట్‌లో పోకార్ గ్రాండ్ పేర్లతో ఆడే స్కిల్ గేమ్‌ను వీరు ఆఫ్‌లైన్ (నేరుగా) ఆడుతున్నారు. డబ్బులు బయటకు కనిపించకుండా రూ.25 నుంచి రూ. 25 వేల వరకు విలువచేసే వివిధ కాయిన్స్ సహాయంతో గేమ్ ఆడుతున్నారు.

వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి గేమ్ ఆడుతున్న అందరినీ అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి లక్షా 87 వేల, 500 రూపాయల నగదు, నానో కారు, 15 సెల్‌ఫోన్లు, పోకర్ గేమ్‌సెట్, 54 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, వీరికి సహకరించిన పార్క్ హోటల్ లాబీ మేనేజర్ అయూబ్ పరారీలో ఉండగా.. రాత్రివేళ హౌస్‌కీపింగ్ పని చేస్తున్న రవికుమార్‌ను అరెస్టు చేశారు.

నిందితులపై  ఏపీగేమ్ యాక్ట్ 3,4,9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.  కాగా, పార్క్ హోటల్‌లో తెల్లవార్లూ పబ్ తెరిచే ఉంచడంతో పాటు జూదం, వ్యభిచారం కొనసాగుతున్నట్టు ఫిర్యాదులందాయని ఏసీపీ తెలిపారు. పార్క్ హోటల్ యాజమాన్యానికి నోటీసులు అందజేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  గతంలో పోలీస్ అధికారితో పార్క్ హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం ఉందని, వారిని ఉపేక్షించేది లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement